రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ప్రతి పనికి గడువు విధించి నిర్మాణాలు చేపట్టాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ప్రతి పనికి గడువు విధించి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం దేవాదాయ, మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, ఎన్‌పీడీసీఎల్, నీటిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. కార్మికుల సంఖ్యను పెంచి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
రాజరాజేశ్వర ఆలయ నూతన గోశాల పనుల పురోగతిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. గుడి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి పర్యాటక, వేములవాడ మున్సిపల్ శాఖ అధికారులకు సూచనలు చేశారు.
బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు చేపడుతున్న 80 అడుగుల రహదారి విస్తరణ పనుల పురోగతిని సమీక్షించారు.
రహదారి నిర్మాణంతో పాటు ఇరువైపులా మురుగు కాలువల నిర్మాణ తుది దశ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ టవర్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు.
జిల్లా వైద్య కళాశాల, బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సిరిసిల్లలో కోర్టు సముదాయ పనులను కూడా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ భీమ్లానాయక్, ఆలయ ఈఈ రాజేష్, ఎన్‌పీడీసీఎల్ ఈఈ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
