వార్డుల పునర్విభజన ప్రతిపాదిత ముసాయిదా ప్రచురణ..

వార్డుల పునర్విభజన ప్రతిపాదిత ముసాయిదా ప్రచురణ..
- కర్నూలుకు 42, పాణ్యంకు 22, కోడుమూరుకు 4 వార్డులు
- 24వ తేదీ వరకు సూచనలు, సలహాలు, అభ్యంతరాల స్వీకరణ
- నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్నికల వార్డులను 68 వార్డులుగా పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను కమిషనర్ చల్లా ఓబులేసు, పట్టణ ప్రణాళిక అధికారులు ప్రచురించారు. సోమవారం కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ప్రతిపాదిత ముసాయిదా ప్రతులను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవో నెంబర్ 65 ప్రకారం వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నగరంలో 4,77,718 లక్షల జనాభా ఉందని, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, స్థానిక అవసరాలు వంటి సమగ్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రతిపాదిత ముసాయిదాను రూపొందించినట్లు వివరించారు.
ఇందులో కర్నూలు నియోజకవర్గంలో 42 వార్డులు, పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ పరిధిలో 22 వార్డులు, కోడుమూరు నియోజకవర్గ పరిధిలో 4 వార్డులు ఉన్నట్లు తెలిపారు. వార్డుల సరిహద్దులతో కూడిన ఈ ప్రతిపాదిత ముసాయిదాను నగరపాలక సంస్థ కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాలు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.
ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నగరపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో తుది వార్డుల పునర్విభజన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఇంచార్జీ సిటి ప్లానర్ వై.వి. వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.
