గుప్తనిధుల వేటగాడు అరెస్ట్ ..

గుప్తనిధుల వేటగాడు అరెస్ట్ ..

డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడి..

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.

అనకాపల్లి జిల్లాకు చెందిన మంకు నాయుడు అనే వ్యక్తి గత పది సంవత్సరాలుగా తిరుపతిలో నివాసం ఉంటున్నాడని, నెల రోజుల క్రితం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద ఒక గది అద్దెకు తీసుకుని గుప్తనిధుల అన్వేషణ చేస్తున్నాడని తెలిపారు. చిలమత్తూరు మండలం ముచ్చలగుట్టలో తవ్వకాలు జరుపుతుండగా స్థానికుల సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు చెప్పారు. నిందితుడి వద్ద నుండి రెండు డ్రిల్లింగ్ మిషన్లు, ఆరు బ్యాటరీలు, మూడు చార్జర్లు, ఒక పవర్ సప్లై బాక్స్, 25 జెలటిన్ స్టిక్స్, ఏడు డ్రిల్లింగ్ బిట్స్, రెండు టార్చ్ లైట్లు, ఒక ఇనుప గడ్డపార, ద్విచక్ర వాహనం, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిపై తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతం అతన్ని కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు.

అదేవిధంగా నిందితుడు ఈ సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకున్నాడనే అంశంపై మరింత విచారణ కొనసాగుతుందని చెప్పారు. గుప్తనిధులు ఉన్నాయని ఎవరైనా చెప్పినా నమ్మి మోసపోవద్దని ప్రజలకు డీఎస్పీ సూచించారు. ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Leave a Reply