2026june | ఏపీలో రాజ్యసభ ఎన్నికల హీట్
2026june | ఏపీలో రాజ్యసభ ఎన్నికల హీట్
2026june | టీడీపీ తరపున అన్నీ గెలుచుకునే చాన్స్
అయినా కూటమి ధర్మం పాటిస్తున్న టీడీపీ హైకమాండ్
తెలుగుదేశం కోటాను మిత్రపక్షాలకు దారపోయాల్సిన స్థితి
బీజేపీకి, జనసేనకు సీట్లు కేటాయించే చాన్స్
నామినేటెడ్ పోస్టుల్లోనూ తమ్ముళ్లకు దక్కని అవకాశాలు
ఇదేం ఖర్మ అంటూ.. పార్టీ కేడర్లో అసహనం
అసంతృప్తిని చల్లార్చేందుకు చంద్రబాబు, లోకేష్ యత్నాలు
2026june | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సీట్ల సర్దుబాటు వేడి మొదలైంది. 2026 జూన్లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల కావడంతో అధికార కూటమిలో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం నాలుగు స్థానాలనూ కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ, వాటి పంపిణీలో తెలుగుదేశం పార్టీ తన కోటాను మిత్రపక్షాలకు ధారపోయాల్సి రావడం ఇప్పుడు క్షేత్రస్థాయి కేడర్లో అసహనానికి దారితీస్తోంది. దశాబ్ద కాలంగా పార్టీ కోసం కష్టపడిన ‘తమ్ముళ్ల’ ఆశలపై కూటమి రాజకీయాలు నీళ్లు చల్లుతున్నాయనే ఆవేదన ఆ పార్టీ సెకండరీ స్థాయి లీడర్లలో వ్యక్తమవుతోంది.
త్యాగాల బాటలో టీడీపీ?
ప్రస్తుత అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలనూ కూటమి అవలీలగా గెలుచుకోగలదు. అయితే.. ఢిల్లీ రాజకీయ అవసరాలు, కూటమి ధర్మం ప్రకారం.. ఈ నాలుగు స్థానాల్లో రెండింటిని మాత్రమే టీడీపీ ఉంచుకుని, మిగిలిన రెండింటిని జనసేన, బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్సభలో బలంగా ఉన్నప్పటికీ, రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవాలన్న తహతహలో ఉన్న బీజేపీకి ఒక స్థానం, పవన్ కళ్యాణ్ కోరిక మేరకు జనసేనకు ఒక స్థానం దక్కనున్నాయి. దీనివల్ల పదవుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు మొండిచేయి ఎదురవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అసంతృప్తికి కారణాలు.. నామినేటెడ్ పోస్టుల నుంచే మొదలు!
కేవలం రాజ్యసభ సీట్లే కాదు, ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. మొదటి విడతగా ప్రకటించిన కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్లో జనసేన, బీజేపీకి గౌరవప్రదమైన వాటా దక్కినప్పటికీ, అనేక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకున్న టీడీపీ నేతలకు డైరెక్టర్ పదవులతో సరిపెట్టడంపై అసహనం నెలకొంది. మాజీ మంత్రులు దేవినేని ఉమ వంటి సీనియర్లకు ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడం, జనసేన సిఫార్సు చేసిన వారికి కీలక పోస్టులు దక్కడం వంటివి టీడీపీ శ్రేణులను కాస్త ఇబ్బంది పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
స్థానిక ఎన్నికల భయం.. కేడర్లో ఆందోళన
ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే త్యాగాల పర్వం కొనసాగుతుందేమోనని తెలుగుదేశం కార్యకర్తలు భయపడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన పట్టుబట్టడం వల్ల పదేళ్ల పాటు గ్రామా స్థాయిలో పోరాడిన టీడీపీ కార్యకర్తలు తమ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ‘‘అధికారంలోకి వచ్చినా పదవులు మిత్రపక్షాలకే పోతుంటే, మేం ఎవరి కోసం కష్టపడాలి?’’ అన్న ప్రశ్న తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, నారా లోకేష్ స్వయంగా ప్రతి జిల్లా నేతలతో భేటీ అవుతూ, కూటమి అవసరాలను వివరిస్తూనే.. భవిష్యత్తులో వారికి తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాని వారికి ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ కమిటీలు, మార్కెట్ యార్డుల్లో ప్రాధాన్యం కల్పిస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది.
కూటమి ధర్మం వర్సెస్ కేడర్ సెంటిమెంట్
రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలంటే బీజేపీని, క్షేత్రస్థాయిలో ఓట్లు చీలకూడదంటే జనసేనను కలుపుకుపోవడం చంద్రబాబుకు అనివార్యం. అయితే.. ఈ త్యాగాలు పార్టీ పునాదులను కదిలించకుండా చూసుకోవడమే ఇప్పుడు టీడీపీ హైకమాండ్ ముందున్న అసలైన సవాలు. 2026 రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల నాటికి ఈ అసంతృప్తి తగ్గుతుందా లేదా అనేది పార్టీ అంతర్గత సర్దుబాట్లపైనే ఆధారపడి ఉందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
CLICK HERE TO READ Rs. 4 lakhs | ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత
