2026 FIFA World Cup | జోర్డాన్‌పై 3-1తో విజయం
2026 FIFA World Cup | జోర్డాన్‌పై 3-1తో విజయం
ఆస్ట్రియా అదుర్స్..
2026 FIFA World Cup |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : 2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఆస్ట్రియా జట్టు విజయవంతమైన ఆరంభం చేసింది. గ్రూప్-జేలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో జోర్డాన్‌ను 3-1 తేడాతో ఓడించి కీలక మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాంతా క్లారాలో జరిగిన ఈ పోరులో ఆస్ట్రియా అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆస్ట్రియా 20వ నిమిషంలో రోమానో ష్మిడ్ చేసిన అద్భుత గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి అదే స్కోరు కొనసాగింది.
రెండో అర్ధభాగంలో జోర్డాన్ కూడా ప్రతిఘటించింది. 50వ నిమిషంలో అలీ ఒల్వాన్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో జోర్డాన్ తరఫున నమోదైన తొలి గోల్ కావడంతో ఆ జట్టు అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రియా మళ్లీ పట్టు సాధించింది. 75వ నిమిషంలో జోర్డాన్ డిఫెండర్ యాజన్ అల్-అరబ్ చేసిన ఓన్ గోల్‌తో ఆస్ట్రియా మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో స్టార్ ఆటగాడు మార్కో అర్నాటోవిచ్ పెనాల్టీని గోల్‌గా మలచడంతో ఆస్ట్రియా విజయం ఖాయమైంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ప్రపంచకప్ వేదికపై అడుగుపెట్టిన ఆస్ట్రియా, తొలి మ్యాచ్‌లోనే విజయంతో తన ఉనికిని చాటగా.. జోర్డాన్ మాత్రం చారిత్రాత్మక తొలి గోల్ సాధించినా పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది.
మ్యాచ్‌లో గోల్స్
ఆస్ట్రియా:
⚽ రోమానో ష్మిడ్ (20′)
⚽ యాజన్ అల్-అరబ్ (75′ ఓన్ గోల్)
⚽ మార్కో అర్నాటోవిచ్ (90+12′ పెనాల్టీ)
జోర్డాన్:
⚽ అలీ ఒల్వాన్ (50′)
