15thMayeditorial | తైవాన్ అంశంపై అమెరికా–చైనా మధ్య ఉద్రిక్త చర్చలు

15thMayeditorial | తైవాన్ అంశంపై అమెరికా–చైనా మధ్య ఉద్రిక్త చర్చలు

15thMayeditorial | తైవాన్ అంశంపై జిన్ పింగ్ గట్టిగా హెచ్చరిక
ట్రంప్–జిన్ పింగ్ భేటీలో ఉత్కంఠభరిత చర్చలు
వాణిజ్యం, ఏఐ, ఇరాన్ యుద్ధంపై ప్రాధాన్య చర్చలు
అమెరికా–చైనా మధ్య పోటీ, సహకారం సమతుల్యం

15thMayeditorial | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం నుంచి చైనాలో పర్యటిస్తున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత తమ దేశానికి వచ్చిన అగ్రరాజ్యాధినేతకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఘనస్వాగతం పలికారు. ఇరువురు పరస్పర ఆసక్తికరమైన అంశాలపై చర్చలు జరిపిన తర్వాత తైవాన్ విషయానికి వచ్చేసరికి తమ వైఖరులను చాలా నిర్మొహమాటంగా స్పష్టం చేసుకోవడం వారి సహజ ధోరణిని ప్రస్ఫుటం చేస్తున్నది.

ఈ విషయాన్ని ముందుగా జిన్ పింగ్ ప్రస్తావించి తైవాన్ సమస్యను సరిగా పరిష్కరించుకోకపోతే ఇరుదేశాల మధ్య ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంటే, తైవాన్ విషయంలో చైనా వైఖరిలో మార్పు లేదనీ, తైవాన్ జోలికి రావద్దని అమెరికా అధ్యక్షుణ్ని జిన్ పింగ్ హెచ్చరించారు. అదే సందర్భంలో అమెరికాతో ఘర్షణ తమ వైఖరి కాదని, భాగస్వామ్య దేశాలుగా ఉండాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.

చైనా, అమెరికాలు ఉత్తర, దక్షిణ ధ్రువాల వంటివి. వాటి మధ్య సామరస్యం అనేది వాస్తవానికి బహుదూరమైన మాట. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్లు జరిపిన యుద్ధంలో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో యావత్ ప్రపంచానికి తెలుసు. అలాగే, ఈ యుద్ధంలో చైనా అనుసరించిన వైఖరి కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ, ఇంతటి విధ్వంసానికీ ట్రంప్ వైఖరే కారణమని జిన్ పింగ్‌కి తెలుసు.

అయినప్పటికీ, తమ దేశానికి అతిథిగా వచ్చారు కనుక మర్యాద చేసి పంపడం తన విధిగా జిన్ పింగ్ భావించారు. అదే సందర్భంలో తైవాన్ విషయంలో తమ దేశం దశాబ్దాలుగా అనుసరిస్తున్న వైఖరిలో ఎటువంటి తేడా లేదని స్పష్టం చేయడమే ఆయన ఉద్దేశ్యం. అదే సమయంలో మాటల మధ్యలో తైవాన్ గురించి ప్రస్తావించి చైనాలో ఏమైనా మార్పు వస్తుందేమోనని భావించిన ట్రంప్ ఆశలపై జిన్ పింగ్ నీళ్లు జల్లారు.

ఇరు దేశాలు కలిసి మెలిసి ఉంటే ప్రపంచానికి మేలు జరుగుతుందన్న జిన్ పింగ్ మాటల్లో పరోక్షంగా తైవాన్ ప్రస్తావన ఉంది. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాలను పరిరక్షించడం ఇరుదేశాల ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. తైవాన్ విషయంలో ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలనీ, తేడా వస్తే ఇరుదేశాలకూ అది నష్టంని హెచ్చరించడం కూడా జిన్ పింగ్ ముఖ్యోద్దేశ్యం.

తైవాన్ విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరిని అమెరికా ప్రశ్నించరాదన్నది జిన్ పింగ్ ఉద్దేశ్యం. అయితే తైవాన్ స్వతంత్రతను కాపాడుతామని తాము హామీ ఇచ్చినట్టు అమెరికా చెబుతోంది. తమ మధ్య విభేదాల కంటే ఉమ్మడి ప్రయోజనాలే ఎక్కువ ఉన్నాయని జిన్ పింగ్ ట్రంప్‌కు తెలియజేశారు. తమ దేశంలో లభించే అరుదైన ఖనిజాలను అమెరికా ఆశిస్తోందన్న విషయాన్ని ఆయన నర్మగర్భంగా ప్రస్తావించారు.

వాణిజ్య రంగంలో ఇరుదేశాలు ముందడుగు వేయాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. ఇరాన్ యుద్ధం ప్రభావంతో ప్రపంచమంతటా చమురు ధరలు పెరిగిపోవడంపై ఇరుదేశాల నాయకులు చర్చించారు. ఇరుదేశాల మధ్య పరోక్ష యుద్ధంగా మారిన కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా సాగిస్తున్న యత్నాలను చైనా వ్యతిరేకిస్తోంది.

ఈ రంగంలో సమున్నత లక్ష్యాలను చేరుకోవడానికి అమెరికా సాగిస్తున్న యత్నాలు అడ్డుపడుతున్నాయని ట్రంప్‌కు జిన్ పింగ్ స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచే విషయంలో ఇరాన్‌ను ఒప్పించాలని చైనా ను అమెరికా కోరుతోంది. అయితే, ఇరాన్ అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోబోమని చైనా స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.

Leave a Reply