14thaprileditorial | ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు

14thaprileditorial | ట్రంప్ చర్యలు.. ప్రపంచ ఆందోళనలు
14thaprileditorial | ఇరాన్‌పై దాడులు: ప్రభావం మరియు పరిణామాలు
గల్ఫ్ దేశాలపై ప్రభావం, చమురు సంక్షోభం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
చైనా, రష్యా పాత్రపై అనుమానాలు
ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు మరియు స్పందనలు
14thaprileditorial |హార్ముజ్ జలసంధి కేంద్రంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఆసియా, ఐరోపా సహనాన్ని పరీక్షిస్తున్నారు. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు, స్వదేశంలో పడిపోయిన తన గ్రాఫ్‌ను తిరిగి పెంచుకునేందుకు ఇరాన్‌లో అణుశుద్ధి కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని నెలన్నరగా చెప్పిన మాట చెప్పకుండా తీవ్ర అసహనం, ఆందోళనలతో విచిత్ర పోకడలు ప్రదర్శిస్తున్నారు.
ఒకవేళ ఇరాన్ నిజంగానే అణుబాంబు తయారీ కార్యక్రమంలో ఉందని బలంగా నమ్మితే, ఆసియా, ఐరోపాలోని భారత్, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలతో ముందుగానే సంప్రదించి, వారిని ఒప్పించి, వ్యూహరచన చేసి ఇరాన్‌ను ఆర్థిక దిగ్బంధనం చేయడం ద్వారా దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయవచ్చు. కానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరించి, ఏకపక్షంగా, భారీ దాడులతో విరుచుకుపడ్డారు. ఇందుకు మరో యుద్ధోన్మాది ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ తోడయ్యారు.

ఏకధాటిగా 40 రోజుల పాటు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడి ఇరాన్‌లో లక్షన్నరకు పైగా కట్టడాలను నేలమట్టం చేసి, లక్షలాది మందిని నిరాశ్రయుల్ని చేసి, అగ్రనేతలను మట్టుబెట్టి వికటాట్టహాసం చేశారు. ఇంత జరిగినా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలు ఉన్న ఎనిమిది అరబ్ దేశాల మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం కురిపించింది. ఖతార్, సౌదీ, కువైట్‌లలో చమురు క్షేత్రాలకు తీవ్ర నష్టం కలిగించింది.
దీంతో ఆసియా, ఐరోపా దేశాల్లో సరఫరా గొలుసు తెగిపోయింది. ధరలు భగ్గుమన్నాయి. ద్రవ్యోల్బణం రెక్కలు విప్పుతోంది. చివరకు అమెరికాలో కూడా సగటున 25 శాతం ధరలు పెరిగిపోయాయి. సొంత దేశంలోనే తీవ్ర అసంతృప్తి నెలకొన్న వేళ, మళ్లీ ట్రంప్ కొత్త విన్యాసానికి తెరలేపారు.

హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేయడానికి మోహరించారు. ఇప్పటికీ దాదాపు 800 పైగా నౌకలు జలసంధిని దాటేందుకు వేచి ఉండగా, వాటన్నిటినీ అమెరికానే అడ్డుకుంటోంది. ఇందులో భారత్‌కు చెందిన నౌకలు కూడా 25 వరకు ఉన్నాయి. ఆయా దేశాల నౌకలను వదిలేందుకు ఇరాన్ కప్పం కట్టించుకుంటోందని ట్రంప్ ఆరోపిస్తుండగా, తాము ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని భారత్ స్పష్టం చేసింది.
జలసంధిని దిగ్బంధనం చేయడం ద్వారా ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం. ఇదే సమయంలో ఇరాన్‌కు సాయం చేస్తున్నావంటూ చైనాను కూడా ట్రంప్ హెచ్చరించారు. దీనికితోడు రష్యా కూడా జత కలిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరెలా పోతే నాకేం అన్న ధోరణిలో ఉన్న ట్రంప్ తాజాగా క్రైస్తవ మత అత్యున్నత గురువు పోప్‌ను కూడా తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇరాన్‌పై సానుభూతి చూపుతున్నారంటూ మండిపడ్డారు. పైగా తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో మరో విచిత్ర విన్యాసం కూడా చేశారు. తానే స్వయంగా జీసస్ అని భావిస్తూ, రోగికి స్వస్థత అందిస్తున్నట్టు ఉన్న ఒక చిత్రాన్ని పోస్ట్ చేశారు. దీంతో ఆయా దేశాల్లోని క్రైస్తవులు కూడా అవాక్కయ్యారు. ట్రంప్ విన్యాసాలపై తీవ్ర నిరసనలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
