Andhra Prabha SPL Story | మోడీ నాయకత్వం: వ్యూహం – నిర్ణయాలు

Andhra Prabha SPL Story | మోడీ నాయకత్వం: వ్యూహం – నిర్ణయాలు
Andhra Prabha SPL Story | మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రాధాన్యం
డీలిమిటేషన్: రాజకీయ లాభనష్టాలు
ప్రతిపక్షాల అభ్యంతరాలు మరియు విమర్శలు
జనగణన, పాత లెక్కలు: వివాదానికి కారణం
భారత రాజకీయాల్లో మార్పుల దిశ
Andhra Prabha SPL Story | తన ప్రజలు ఎక్కడున్నారో అక్కడి నుంచి.. ఎక్కడ లేరో అక్కడికి సమున్నతంగా తీసుకెళ్లగలిగిన వాడే అసలైన నాయకుడు. ఇది సుప్రసిద్ధమైన హెన్రీ కిసింజర్ కొటేషన్. బీజేపీ జాతీయ నాయకులు దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా ఇష్టంగా అనువర్తింప చేస్తూ కీర్తిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఒక్క తమ నాయకుడికి మాత్రమే ఇది వర్తిస్తుందని కూడా చెబుతారు. దీన్నేమీ అతిశయోక్తిగా అనుకోనక్కర్లేదు. ప్రధాని మోడీ 2014 మే 26న మొదటిసారి భారతదేశ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నాటినుంచి ఇన్నేళ్ల కాలంలో ఆయన చేసిన నిర్ణయాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అందులో కొన్ని సాహసోపేతమైనవి మరికొన్ని దుస్సాహసమైనవి ఉన్నాయి. అది వేరే విషయం. కాని డెబ్బయ్ తొమ్మిదేళ్ల స్వతంత్ర భారతదేశంలో జరగని అనేకానేక నిర్ణయాలు ఆయన మానస పుత్రికలుగా ముద్రపడ్డాయి. అలాంటి సందర్భమే మళ్లీ ఇప్పుడు వచ్చింది.
నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశమవుతున్నాయి. కేంద్రంలోని పాలక ఎన్డీయే పక్షం దీన్ని అత్యంత కీలకమైనదిగా భావిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం అకాల సమావేశాలు, విమర్శలు చేస్తున్నాయి. చట్ట సభల్లో మహిళలకు మూడోవంతు సీట్లు రిజర్వు చేయాలని దశాబ్దాలుగా నలుగుతున్న ప్రతిపాదనకు కార్యరూపం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించంది. దానితో పాటే లోక్‌సభలో సీట్ల సంఖ్యను పెంచాలన్నది మరొక అంశం. ఈరెండూ అత్యంత కీలకమైనవి. ఇంకా చెప్పాలంటే దాదాపు ఎనిమిది దశాబ్దాల స్వతంత్ర భారతదేశపు దశ, దిశని సమూలంగా మార్చేసే ఆయుధాలు. స్థానికం నుంచి జాతీయ స్థాయి వరకు మహిళా లోకానికి తిరుగులేని ప్రాతినిధ్యం కల్పిస్తే అది మరో ప్రపంచం అవుతుందన్నది నిజం. మహిళా సాధికారతకు ఇదొక వజ్రాయుధం.
ఇక మరొక అంశం నియోజకవర్గాల పునర్విభజన. లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను 850కి పెంచాలన్నది కీలక ప్రతిపాదనగా ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాల పత్రాన్ని ఇప్పటికే లోక్‌సభ సభ్యులకు పంచిపెట్టారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఎంపీల సీట్లు ఎక్కడికక్కడ పెరుగుతాయి. ఇందుకు తీసుకున్న గీటురాయి మీద ప్రభుత్వం, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రతిపక్షాలు అసలిప్పుడు ఇంత ఆదరాబాదరా, అగత్యం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. ఒకవంక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈ సమావేశాలేమిటని ప్రతిపక్షాల ప్రశ్న. అఖిలపక్షంతో ముందుగా మాట్లాడకుండా పునర్విభజన ఏమిటని కూడా నిలదీస్తున్నాయి. మహిళా బిల్లుకి మాత్రం అభ్యంతరం లేదు కానీ సందేహాలు మాత్రం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదంతా ప్రధాని మోడీ వ్యూహం ప్రకారమే జరుగుతున్నది. లోక్‌సభ సభ్యుల సంఖ్య పెంచాలన్న ఆలోచనలో సుదీర్ఘ కసరత్తు ఉంది. కొత్త పార్లమెంటు నిర్మాణమే ఒక ఉదాహరణ. ప్రస్తుత లోక్‌సభ 888 మందికి కూర్చోవడానికి వెసులుబాటు కల్పిస్తోంది. దీర్ఘకాలిక భావి వ్యూహాలకు మోడీ పెట్టింది పేరు.
ప్రణాళికా సంఘం రద్దు నుంచి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాల వరకు ఆయన తన నిర్ణయాలను అమలు చేశారు. కొన్ని విమర్శలు, బెడిసికొట్టాయి అన్న అభిప్రాయాలు ఉన్నా అవి ఆయన రాజకీయ ప్రయాణానికి అడ్డంకి కాలేదు.
మహిళలకు రిజర్వేషన్ కల్పించడం ద్వారా తిరుగులేని మద్దతు పొందాలని లక్ష్యం. అయితే డీలిమిటేషన్‌ను త్వరగా అమలు చేయాలన్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా అమలు చేయాలన్న నిర్ణయం పై విమర్శలు, స్వలాభాపేక్ష, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంది.
తాజా జనగణన జరుగుతున్న సమయంలో పాత లెక్కలతో నిర్ణయాలు తీసుకోవడం అనౌచిత్యం అన్న భావన ఉంది. కానీ రాజకీయంగా ఇది కీలక నిర్ణయం. మోడీ ఒక సంకల్ప నాయకుడుగా ప్రజల ముందున్నారు. కోవిడ్ నుంచి అంతర్జాతీయ సంక్షోభాల వరకు తీసుకున్న చర్యలు ప్రజలను సంతృప్తి పరిచాయి. దౌత్య విధానాలు, చమురు నిల్వల నిర్వహణ ప్రజల్లో ముద్ర వేసాయి. అందువల్ల మోడీపై సానుకూలత పెరుగుతోంది.
అయితే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. పాత జనాభా లెక్కల ప్రాతిపదికపై నిర్ణయాలు తీసుకోవడం పై ప్రశ్నలు లేవుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కూడా వివాదాస్పదం అయింది. ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య వివక్ష పెరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది నేతలు హెచ్చరికలు, ఉద్యమాలు గురించి మాట్లాడుతున్నారు. మరికొందరు మోడీకి అండగా నిలుస్తున్నారు. దీంతో రాజకీయంగా కొత్త పునరేకీకరణలు వచ్చే అవకాశం ఉంది.
మహిళా ప్రాతినిధ్యం పెరగడం వల్ల సామాజికంగా సానుకూల మార్పులు రావచ్చు. ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల ప్రజాస్వామ్యం బలపడుతుంది. కానీ పెద్ద సభలో చర్చలు సక్రమంగా జరుగుతాయా అన్నది ఒక సవాల్. అధికార, విపక్షాల మధ్య ఘర్షణలు, నిరుపయోగ చర్చలు పెరిగే ప్రమాదం ఉంది. 850 మంది సభ్యులతో సభ మరింత సంక్లిష్టం కావచ్చు. అందుకే కొత్త నియమాలు అవసరం. ఈ రెండు అంశాలు అత్యంత సానుకూలమైనవి అయినప్పటికీ, పూర్తి ఏకాభిప్రాయం లేకపోవడం ఒక లోటు. చివరకు సంఖ్యాబలం గెలిచినా, జాతీయ స్థాయిలో ఏకత్వం కోల్పోవడం అనిపించవచ్చు.
-వయ్యస్సారెస్
