ఉపాధి కూలీల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలి

ఉపాధి కూలీల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలి

పని ప్రదేశాలలో కూలీలకు కనీసం వసతులు కల్పించాలి
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి

మోత్కూర్, ఆంధ్రప్రభ : ఉపాధి కూలీల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పాలడుగు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల మహాసభ పిట్టల చంద్రయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిధిగా హాజరై ఆయన మాట్లాడుతూ యూపీఎ ప్రభుత్వంలో వామపక్షాల కృషితో ఏర్పడిన ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసెందుకు మోడీ ప్రభుత్వం 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేసిందని విమర్శించ్చారు.

చట్టాన్ని పూర్తిగా రద్దుచేస్తే ప్రజలు తిరగబడతారని గ్రహీంచి బడ్జెట్లో నిధులను తగ్గిస్తూ బలహీన పరచి, చివరకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పేరు మార్చి జీ రాంజీ పేరుతో పథకంగా ప్రవేశపెట్టిందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి పాత పేరునే కొనసాగిస్తూ, బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల బిల్లులు విడుదలచేసి, ఎండా కాలంలో పని కూలీలకు కనీస వసతులు కల్పించాలని, రోజుకు రూ. 600 గౌరవ వేతనం ఇస్తూ, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి 12 వేలు, సంవత్సరంలో 200 రోజులు పనిదినాలు కల్పించాలని డిమాడ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుండు వెంకటనర్సు, రైతు సంఘం మండల కార్యదర్శి దడిపల్లి ప్రభాకర్, మత్య సంఘం నాయకులు వెండి యాదగిరి, చేనేత నాయకులు చింతకింది సోమరాజు, దడిపల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు.