Chahal | ఓవ‌ర్ నైట్ హీరోగా మారిన య‌జువేంద్ర చాహ‌ల్..

  • ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన స్టార్ స్పిన్న‌ర్
  • అత్య‌ల్ప స్కోర్‌ను కాపాడుకుని పంజాబ్ అనూహ్య విజ‌యం

ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) 111 ప‌రుగుల అత్య‌ల్ప స్కోర్‌ను కాపాడుకుని అనూహ్య విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. 112 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తాను 95 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. ఐపీఎల్‌లో ఇంత త‌క్కువ స్కోరును కాపాడుకోవ‌డం ఇదే తొలిసారి.

కాగా, పీబీకేఎస్‌కు ఈ అనూహ్య విజ‌యం ద‌క్క‌డంలో స్టార్ స్పిన్న‌ర్‌ యుజ్వేంద్ర చాహల్ కీల‌క పాత్ర పోషించాడు. కేకేఆర్‌ 62/2 వద్ద దూసుకుపోతున్న సమయంలో అతని నాలుగు వికెట్ల ప్రదర్శన ఆ జ‌ట్టును తీవ్రంగా దెబ్బ‌తీసింది. కెప్టెన్‌ రహానేతో పాటు రఘువంశీ, రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్‌లను పెవిలియ‌న్ పంపాడు.

ఇలా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 28 ప‌రుగులే ఇచ్చి కీల‌క‌మైన 4 వికెట్లు ప‌డ‌గొట్టిన చాహ‌ల్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐపీఎల్‌లో కొన్ని రికార్డుల‌ను సైతం త‌న ఖాతాలో వేసుకున్నాడు.

నాలుగు వికెట్లు తీసి, ఐపీఎల్‌లో 8 సార్లు 4 వికెట్లు తీసిన బౌల‌ర్‌గా సునీల్ న‌రైన్ స‌ర‌స‌న తొలిస్థానంలో నిలిచాడు. దీంతోపాటు ఐపీఎల్‌లో కేకేఆర్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 23 మ్యాచుల్లో చాహల్ నైట్ రైడర్స్‌పై 20.75 సగటు, 7.96 ఎకానమీ రేటుతో 33 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ (32)ను అధిగమించి ఈ రికార్డు నెల‌కొల్పాడు.

ఐపీఎల్‌లో 210 వికెట్ల మార్కును దాటిన చాహల్

చాహల్ ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 211 వికెట్లు పడగొట్టాడు. టోర్నీ చ‌రిత్ర‌లో 200 వికెట్ల మార్కును దాటిన ఏకైక బౌలర్ అతడే. 166 మ్యాచుల్లో 22.73 స‌గ‌టు, 7.91 ఎకానమీ రేటుతో 211 వికెట్లు తీసి, టాప్‌లో కొన‌సాగుతున్నాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 5/40.

హ‌గ్ తో ప్రీతి జింతా అభినంద‌న‌లు..

కాగా, అనూహ్యంగా అందిన విజయంతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రీతి జింటా సంతోషం పట్టలేకపోయింది. చాహల్‌‌ను హత్తుకుని తన సంతోషాన్ని పంచుకుంది. చాహల్‌తో కాసేపు ముచ్చటించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply