పంజాబ్ కింగ్స్ ప్లేయ‌ర్ పై ఎఫ్ఐఆర్!!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న క్రికెటర్ శశాంక్ సింగ్, ఆయన తండ్రి, మధ్యప్రదేశ్ మాజీ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శైలేశ్ సింగ్, వారి కుటుంబ డ్రైవర్‌పై భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వంటమనిషిపై దాడి, దుర్భాషలాడటం, మొబైల్ ఫోన్ లాక్కోవడం, నగదు బదిలీ చేయించుకోవడం వంటి ఆరోపణలతో రతీబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

పోలీసుల వివరాల ప్రకారం, రేవా జిల్లాకు చెందిన విపేంద్ర సింగ్ తోమర్ ఈ నెల 25న శైలేశ్ సింగ్ నివాసంలో వంటమనిషిగా ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ.15 వేల వేతనంతో పాటు భోజనం, వసతి కల్పిస్తామని చెప్పడంతో పనిలో చేరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే, తన పనిలో లోపాలున్నాయని చెబుతూ తన మొబైల్ ఫోన్‌ను తీసుకున్నారని, జూన్ 28న బ్రేక్ ఫాస్ట్ తయారు చేసిన తర్వాత మొబైల్ తిరిగి ఇవ్వాలని కోరగా నిరాకరించారని ఆరోపించాడు. అనంతరం తన గదిలోకి వెళ్లిన సమయంలో శైలేశ్ సింగ్, ఆయన కుమారుడు శశాంక్ సింగ్, డ్రైవర్ కలిసి వచ్చి దుర్భాషలాడుతూ చేతులతో, పిడిగుద్దులతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అంతేకాకుండా తన మొబైల్ ద్వారా రూ.1,000 బదిలీ చేసి, అది భోజనం, వసతి ఖర్చుల కోసం తీసుకున్నామని చెప్పారని ఆరోపించాడు. ఘటన అనంతరం బంధువులతో కలిసి పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఆరోపణలపై శైలేశ్ సింగ్ స్పందన కోసం ప్రయత్నించినప్పటికీ, ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని పోలీసులు తెలిపారు.

వంటమనిషి ఆరోపణలు నిరాధారం: శశాంక్ సింగ్

తనపై నమోదైన దాడి, అక్రమ నిర్బంధం కేసులో పంజాబ్ కింగ్స్ స్టార్ ప్లేయ‌ర్ శశాంక్ సింగ్ స్పందించారు. తన మాజీ వంటమనిషి చేసిన ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ.. అతడే ఇంట్లోని వ్యక్తిగత ప్రాంతాల్లోకి వెళ్లి అనుమతి లేకుండా వీడియోలు చిత్రీకరించాడని ఆరోపించారు. జూన్ 25 సాయంత్రం ఇంటికి వచ్చి, 28 ఉదయం వెళ్లిపోయిన వ్యక్తిని బంధించి ఉంచామని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు.

వంట చేయడం బాగా వచ్చని చెప్పి ఉద్యోగంలో చేరిన వ్యక్తి, తర్వాత తనకు సరిగా వంట చేయడం రాదని అంగీకరించాడని శశాంక్ తెలిపారు. దీంతో అతనిపై నమ్మకం కోల్పోయామని చెప్పారు. అంతేకాకుండా, ఇంట్లోని బెడ్‌రూమ్‌లలోకి వెళ్లి ఖరీదైన వస్తువులు ఉన్న ప్రాంతాల్లో వీడియోలు తీశాడని, వాటిని ఇతరులకు పంపించాడని శశాంక్ ఆరోపించారు.

తన తండ్రి స్నేహితుడి సిఫారసుతో అతడిని పనిలో పెట్టుకున్నామని, ఇంటికి వచ్చిన వెంటనే రూ.20 వేల అడ్వాన్స్ కావాలని కోరాడని తెలిపారు. కొన్ని రోజులు పని చేసిన తర్వాత జీతం, ఉద్యోగం కొనసాగింపుపై నిర్ణయం తీసుకుందామని చెప్పామని శశాంక్ వివరించారు. ఇదిలా ఉండగా, మాజీ వంటమనిషి విపేంద్ర సింగ్ తోమర్ చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.