చంద్రబాబు ‘వెన్నుపోటు’ పాలనకు రెండేళ్లు.. వైకాపా భారీ నిరసన
చంద్రబాబు ‘వెన్నుపోటు’ పాలనకు రెండేళ్లు.. వైకాపా భారీ నిరసన
సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి? అంటూ నినాదాల హోరు
వెన్నుపోటుకు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్: వెల్లంపల్లి
కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న వైకాపా
నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి ఐరన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ
విజయవాడ, (ఆంధ్రప్రభ-భవానిపురం): కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల ఉల్లంఘనకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో వందలాది మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శన కోమల విలాస్, రమణయ్య కూలింగ్ షాప్, సౌమరంగ్ చౌక్ మీదుగా సాగి ఐరన్ సెంటర్ వద్ద ముగిసింది. ర్యాలీ పొడవునా కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ల పాలనలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, కార్మికులు సహా ప్రతి వర్గాన్ని చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు నాయుడే బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఆర్థిక సాయం హామీని ప్రభుత్వం అమలు చేయలేదని, 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి మాట తప్పిందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ వంటి హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
ఉదయం 8 గంటలకే పిలుపునిచ్చినా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి రావడం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని వెల్లంపల్లి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పుణ్యశిల, రేపాల శ్రీనివాసరావు, కుప్పం ప్రసాద్, గుబ్బా చంద్రశేఖర్, కర్నాటి రాంబాబు, మండేపూడి చటర్జీ, మనోజ్ కొఠారి, బంక విజయ, గురుమాహంతు మహేష్, తుపాకుల గురుమూర్తి తదితర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
