Janasena | కాంగ్రెస్ నేతలకు పవన్ హెచ్చరిక

Janasena | కాంగ్రెస్ నేతలకు పవన్ హెచ్చరిక

Janasena | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో జనసేన రాజకీయాలపై వస్తున్న విమర్శలకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇకపై తెలంగాణలో జనసేన ఉంటుందని, తాను తెలంగాణలో తిరుగుతానని స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు భరించామని, 12 ఏళ్లుగా సహించామని, ఇకపై జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని అన్నారు. “ఏం చేస్తారో చేయండి” అంటూ విమర్శకులకు సవాల్ విసిరారు.

తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు పదవుల్లో ఉన్నారని పవన్ వ్యాఖ్యానించారు. ఎవరు రావాలి? ఎవరు రావద్దు? అని చెప్పడానికి ఇది పాలస్తీనా లేదా పాకిస్తానా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాయనాడ్‌లో పోటీ చేయొచ్చని, ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేయొచ్చని గుర్తుచేస్తూ, తాను తెలంగాణకు రావద్దని చెప్పడానికి మీరెవరు? అని నిలదీశారు.

ఏ రాష్ట్రానికి వెళ్లాలన్నా పాస్‌పోర్ట్ తీసుకురావాలా? అని పవన్ ప్రశ్నించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, దేశ సమగ్రతకు భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావద్దని బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు.

ఇప్పటివరకు తెలంగాణలో జనసేన పోటీ చేయాలన్న ఆలోచనలో లేనని, కానీ ఇకపై తెలంగాణలో జనసేన ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక నియోజకవర్గం నుంచైనా పోటీ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

తనను బెదిరించిన వారి విషయంలో రాహుల్ గాంధీ స్పందించాలని పవన్ డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండాలు, దిమ్మెలు కూల్చినప్పుడు తానే నిలబెట్టానని, కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు తనపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందని పవన్ అన్నారు.

Leave a Reply