ముచ్కూర్లో మొక్కల పంపిణీ కార్యక్రమం
ప్రతి ఇంటా ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి: సర్పంచ్ శ్రీనివాస్
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామపంచాయతీలో గురువారం సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి పెంచాలని గ్రామస్తులను కోరారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాషటి రమేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
