YS Jagan| గంగవరం బాధిత కుటుంబాలను పరామర్శించనున్న జగన్

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూలై 14న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల గంగవరం సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు.

విశాఖపట్నంలోని జబ్బార్‌పేటకు వెళ్లనున్న జగన్, ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు. అలాగే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు కారి చిన్నను, ఆయన కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.

ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన, సహాయక చర్యలపై వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. తీరానికి సమీపంలోనే ప్రమాదం జరిగినప్పటికీ సహాయక బృందాలు ఆలస్యంగా ఘటనాస్థలికి చేరుకున్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది.

అంతేకాకుండా, గల్లంతైన మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలను వారు ఇంకా ఆచూకీ లభించకముందే నిలిపివేశారని వైఎస్సార్‌సీపీ విమర్శించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలవాలని, గాలింపు చర్యలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది.