కృష్ణా డెల్టాకు జీవనాడిగా పట్టిసీమ…

గోదావరి జలాలతో రైతన్నకు భరోసా
పవిత్ర సంగమంలో కలిసిన గోదావరి జలాలు…
కృష్ణమ్మకు వర్షాభావంలో పునర్జీవం..
ఎల్‌నినో, వర్షాభావాలవేళ డెల్టా రైతులకు వరంగా పట్టిసీమ..
ఖరీఫ్ సాగుకు ముందుగానే సాగునీరు…
లక్షల ఎకరాల్లో వరి సాగుకు ఊతం..
గోదావరి–కృష్ణా అనుసంధానంతో సాగునీటి స్థిరీకరణ…
తాగునీటి అవసరాలకూ ఇంకొంత భరోసా
20 పంపులతో వేల క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలు…
187 కిలోమీటర్ల ప్రయాణం… శనివారం కృష్ణానదిలోకి చేరిన జలాలు

ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ.. గోదావరి జలాలు పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలవడంతో కృష్ణా డెల్టాకు మరోసారి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాధాన్యతాను మరోసారి స్పష్టమైంది. ఖరీఫ్ సాగు ప్రారంభ దశలోనే గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం ద్వారా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. తీవ్ర వర్షా బావ, ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గోదావరి మిగులు జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడం డెల్టా వ్యవసాయానికి రక్షణ కవచంగా నిలుస్తోంది.

20 పంపులతో ఎత్తిపోస్తూ…

నాలుగు రోజుల క్రితం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు శనివారం రాత్రి పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో కలిశాయి. ప్రస్తుతం 20 పంపుల ద్వారా సుమారు 7,080 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, ఆ జలాలు పోలవరం కుడి ప్రధాన కాలువలో సుమారు 187 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణానదిలోకి చేరుతున్నాయి. ఈ నీటితో ప్రకాశం బ్యారేజీ పరిధిలో సాగునీటి లభ్యత మెరుగుపడి ఖరీఫ్ సాగు వేగం పుంజుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

డెల్టా ఆయకట్టు స్థిరీకరణ….

కృష్ణా డెల్టాలో లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంలో పట్టిసీమ కీలక పాత్ర పోషిస్తుంది . గోదావరి నుంచి నీటిని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించడం వల్ల సాగునీటి కొరత తగ్గడమే కాకుండా వరి దిగుబడులు, వ్యవసాయ ఉత్పాదకత పెరిగే అవకాశం కనిపిస్తుంది.

ఇటీవలి కాలంలో వర్షపాతం అస్థిరంగా మారడం, ఎల్‌నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో ముందస్తు సాగునీటి నిర్వహణ అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి–కృష్ణా అనుసంధానం ద్వారా రైతులకు సకాలంలో నీరు అందించడం వ్యవసాయ స్థిరత్వానికి దోహదపడుతోంది. ఖరీఫ్ ప్రారంభంలోనే నీరు అందడంతో రైతులు నారు మడులు, వరి నాట్ల పనులను వేగవంతం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

చూసేందుకు వస్తున్న పర్యాటకులు…

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడిలో చేరిన దృశ్యాన్ని తిలకించేందుకు ఆదివారం పవిత్ర సంగమానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. కృష్ణా నదిలో ఇప్పటికే ఉన్న నీటితోపాటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు వచ్చి పవిత్ర సంఘంలో కలుస్తూ రెండు పాయలుగా ఉన్న అపురూప దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. రైతులు మాత్రం ఈ జలాలను తమ పంటలకు భరోసాగా అభివర్ణిస్తూ, సకాలంలో సాగునీరు అందితే దిగుబడులు పెరిగి వ్యవసాయ వ్యయం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.