Youth | చాప కింద నీరులా గంజాయి..

Youth | చాప కింద నీరులా గంజాయి..
Youth | టేకుమట్ల, ఆంధ్రప్రభ : పల్లె పట్టణం తేడా లేకుండా విస్తరణ నిసలు అవుతూ తమ జీవితాలను ఆగం చేసుకుంటున్న యువకులు మత్తు యువతను చిత్తు చేస్తున్నది. మండలవ్యాప్తంగా గంజాయి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ వినియోగం పెరుగుతున్నది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా గుట్టుగా గమ్యస్థానాలకు చేరుతున్నది. పోలీసులు కొంత వరకు కట్టడి చేసినా ప్రతి రోజూ ఏదో ఒక దగ్గర పట్టుబడుతూనే ఉన్నది..


మారుమూల ప్రాంతాల్లో గంజాయి భూతం జడలు విప్పుతోంది. విద్యార్థుల జీవితాలను మత్తులో ముంచేస్తోంది. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న గంజాయి మాఫియా చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాప కింద నీరులా తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలు తీసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచం పడుతున్నారు. మత్తు పదార్థాలు సరదా కోసం అలవాటు చేసుకొని వాటికి బానిసలై అతిచిన్న వయసులోనే వృద్ధులుగా కనిపించేవారు కొందరుంటే, ఇంకొంత మంది జీవచ్ఛవాల్లా కాలం గడుపుతున్నారు.
Youth | చీకటిపడితే చాలు…

చీకటిపడితే చాలు చాలా గ్రామాల్లో యువకులు రహస్య ప్రదేశాలకు వెళ్లి గుంపులుగా ఓ చోట చేరి గంజాయి సిగరెట్లు తాగి మత్తుకు లోనవుతున్నారు. యువకులు, మైనర్లు కూడా అలవాటు పడుతున్నారు. అసలు గంజాయి ఎకడి నుంచి సరాఫరా అవుతుంది?. ఎవరు తీసుకొస్తున్నారు?. స్థానికంగా ఎవరు విక్రయిస్తున్నారు?. అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉంది. కొంతమంది జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట నుండి కొంత మంది గంజాయి టేకుమట్ల లోని పలు ప్రాంతాలకు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.

Youth | అప్పుడే ఎక్కువ అలవాటవుతూ…
మొదట్లో కొందరు మాత్రమే ఈ మత్తుకు అలవాటుపడి వ్యసనంగా మార్చుకొని అక్కడితో ఆగకుండా పక్కవారిని ఈ మత్తు పదార్థాలు అలవాటు పడేలా చేసి క్రమంగా వారిని బానిసలుగా చేస్తారు. ఇలా బానిసలైన వారే ఎక్కువగా డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటారు. గంజాయికి అలవాటుపడిన యువకులు మిగతావారితో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తుండాలి. ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే యువకులు దీనివైపు మొగ్గు చూపుతారు. అలాంటివారి ప్రవర్తన ఇంట్లోనూ వేరే విధంగా ఉంటుంది.
ఒంటరిగా ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా లేవడం, నేరుగా కళ్లలోకి చూడకుండా పక్కలకు చూస్తూ మాట్లాడడం లాంటివి. ఎరుపు రంగులో ఉంటాయి. వీరు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మాట్లాడేటప్పుడు కాస్త తడబడుతూ ఉంటారు. శుభ్రతపై మక్కువపోయి, మాసిన దుస్తులతో తిరుగుతుంటారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు.. ఎందుకని అడిగితే అదే ఫ్యాషన్ అంటూ సాకులు చెబుతుంటారు. గతంతో పోలిస్తే పాకెట్ మనీ ఎక్కువ కావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుంటారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
పిల్లల నడవడిక, వారి అలవాట్లు, స్నేహాలు, చదువు మొదలైన వాటిని దగ్గరుండి పర్యవేక్షించే బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకంటే మొదట కళాశాల, తర్వాత ఇంట్లో యువత ఎక్కువ గడిపేది. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుండటంతో పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది. అందువల్ల పిల్లలపై పర్యవేక్షణ కరువవుతుండటంతో వారు చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
