మున్సిపల్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఘన విజయం

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పురపాలిక లోని 6వ వార్డు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎరుకలి సత్యమ్మ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ఎరుకలి మారెప్ప పై 37ఓట్ల మెజారిటీ తో ఘన విజయం సాధించారు. ఇటీవల ఫిబ్రవరి 11న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఒకరోజు ముందు బీజేపీ అభ్యర్థి ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం తో ఉప ఎన్నిక అనివార్యమయ్యింది.ఈ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా మృతుడు ఎరుకలి మహాదేవప్ప సతీమణి ఎరుకలి సత్యమ్మ పోటీ చేయగా అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా మారెప్ప ,బిఆర్ఎస్ అభ్యర్థిగా మొగులప్ప తలపడ్డారు.

ఫిబ్రవరి 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో గెలిచి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ నలుగురు కోఆప్షన్ సభ్యులను గెలుచుకున్నప్పటికీ ఈ ఉప ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని విశ్వ ప్రయత్నాలు చేసింది .అదే సమయంలో బిజెపి సైతం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉప ఎన్నికల్లో చనిపోయిన ఎరుకలి మహాదేవప్ప భార్యను ఎరుకలి సత్యమ్మ గెలుపు ద్వారానే అతడి ఆత్మకు శాంతి చేకూర్చాలని పనిచేసి గెలుపు సాదించి సత్తా చాటింది. బిజెపి కాంగ్రెస్ శ్రేణులు హోరాహోరీగా ప్రచారం చేశారు. ఎట్టకేలకు ఓటర్లు బిజెపి అభ్యర్థి ని ఆశీర్వదించారు.

సోమవారం జరిగిన కౌంటింగ్ సందర్భంగా గెలుపు ఓటములపై కాంగ్రెస్ బిజెపి శ్రేణుల్లో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మొత్తం 1453 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ సందర్భంగా 1294 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఎరుకలి సత్యమ్మకు 628 ఓట్లు రాగా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారెప్ప కు 591 ఓట్లు సాధించడంతో బిజెపి అభ్యర్థి ఎరుకలి సత్యమ్మ 37 ఓట్ల ఆదిత్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదే సమయంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి మొగులప్ప 46 ఓట్లు సాధించారు.నోటాకు 4 ఓట్లు,25 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. బిజెపి అభ్యర్థి ఎరుకలి సత్యమ్మ 37 ఓట్ల ఆదిత్యంతో ఘనవిజయం సాధించడంతో బిజెపి శ్రేణులు సంబరాల్లో మునిగితేలారు. కాగా ఉప ఎన్నకతో మక్తల్ మునిసిపాలిటీలో బిజెపి సంఖ్య 3 నుండి 4 కు చేరుకుంది.

Leave a Reply