పురిగూడిసెలు లేని నియోజకవర్గంగా జుక్కల్‌ను తీర్చిదిద్దుతాం

-ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్, ఆంధ్రప్రభ: జుక్కల్ నియోజకవర్గాన్ని పూరిగుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు.

జుక్కల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పూరిగుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు తమ వివరాలు నమోదయ్యాయో లేదో అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. వివరాల నమోదు ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో పేదల సొంతింటి కల సాకారం కోసం అధికారులు నిస్వార్థంగా సేవలందిస్తూ, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు అండగా నిలవాలని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా సహకరించాలని కోరారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తూ పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అధికారులు చిత్తశుద్ధితో భాగస్వాములు కావాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పలువురు లబ్ధిదారుల సమస్యలను సమావేశంలోనే పరిష్కరించారు. జుక్కల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు పాల్గొన్నారు.