world cup|హైబ్రిడ్ పిచ్ వినియోగం?

world cup|హైబ్రిడ్ పిచ్ వినియోగం?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ కు రంగం సిద్దమవుతోంది. సెమీస్ లో దక్షిణాఫ్రికాకు అనూహ్యంగా షాకిచ్చి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ ఫైనల్‌లో గెలిస్తే వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. 2021లో ఫైనల్ చేరినప్పటికీ ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. భారత్ ఇప్పుడు కివీస్ ను ఎదుర్కోబోతున్న మైదానం అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం. ఈ టోర్నీలో భారత్ ఓడిన ఏకైక మ్యాచ్ ఇక్కడే. దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఇక్కడ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో ఈసారి పిచ్ పై మార్పులు జరుగుతున్నాయి.

అహ్మదాబాద్ లోని మోతెరాలో ఉన్న ఈ స్టేడియం పిచ్.. మూడు రకాల ఉపరితలాలను కలిగి ఉంది. ఎర్ర నేల, నల్ల నేల, రెండింటి యొక్క హైబ్రిడ్. ఇందులో ప్రతీ పిచ్ దేనికదే భిన్నమైనది. నల్ల నేల పిచ్‌లు స్లోగా ఉంటాయి. బ్యాటర్లకు ఆడటం కష్టంగా ఉంటుంది. అలాగే ఎర్ర నేల పిచ్ లు సాధారణంగా బౌన్స్, పేస్‌ను కలిగిఉంటాయి. దీంతో అధిక స్కోర్లు నమోదవుతాయి.
టైటిల్ పోరుకు ఎరుపు, నలుపు నేలల మిశ్రమంగా ఉన్న సెంటర్ పిచ్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది స్ట్రోక్‌ప్లేకు తగినంత బౌన్స్, పేస్‌ను అందిస్తాయి. అలాగే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ బౌలర్లకు కొంత పట్టును కూడా అందిస్తాయి. అయితే ఈ హైబ్రిడ్ పిచ్ ను రెడీ చేస్తున్నా ఫైనల్ గా ఎంపిక చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. ఈ హైబ్రిడ్ పిచ్ ఊహించిన విధంగా స్పందిస్తే.. ఫైనల్ వేగవంతమైన, అధిక స్కోరింగ్ మ్యాచ్ గా మారవచ్చు.
