ప్రతి విద్యార్థి ఉన్నత పౌరుడిగా రాణించాలి..

ప్రతి విద్యార్థి ఉన్నత పౌరుడిగా రాణించాలి..

  • జిన్నారం కళాశాల ప్రిన్సిపల్ కె.కృష్ణకుమార్

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ప్రతి విద్యార్థి ఉన్నత పౌరుడిగా రాణిస్తేనే చ‌దువుకు సార్థ‌క‌త అని జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కె.కృష్ణకుమార్ అన్నారు. ఆదివారం తారా ప్రభుత్వ కళాశాల సంగారెడ్డిలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో విద్యా వారోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.కృష్ణకుమార్ మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసంలో విద్య మాత్రమే ప్రధానమైన పాత్రను వహించదని, వ్యక్తి విద్యతో పాటు సమాజంపై పూర్తి అవగాహనను కలిగి ఉన్నప్పుడే ఉన్నత పౌరుడిగా రాణించగల‌రని చెప్పారు.

ఉన్నతమైన లక్ష్యాలను నిర్ణయించుకుని నిరంతరం కృషి చేస్తే సమాజంలో ఉన్నత పౌరుడిగా ఉంటార‌ని పేర్కొన్నారు. విద్యార్థులుగా విద్యతో పాటు అదనపు నైపుణ్యం ఉంటేనే సమాజంలో స్థిరపడగలుగుతారని తెలిపారు. తల్లి, తండ్రి, గురువులను గౌరవించినప్పుడే సమాజంలో విద్యార్థి విలువ పెరుగుతుందని అన్నారు. తారా కళాశాల నుంచి ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న 11 మంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, కళాశాలకు గుర్తింపు తీసుకుని వచ్చిన విద్యార్థులను సర్టిఫికెట్స్, మెడల్స్ తో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్ర‌వీణ‌, వైస్ ప్రిన్సిపల్ నిర్మల, డాక్టర్ జగదీశ్వర్, ఐక్యు ఏసీ కన్వీనర్ డాక్టర్ వాణి, ప్రజాపాలన-ప్రగతి ప్ర‌ణాళిక‌ కన్వీనర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సుచిత్రసింగ్, డాక్టర్ సరోజినీ చక్రవర్తి, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ సదయకుమార్, డాక్టర్ జోష్ణ, డాక్టర్ వాణి, డాక్టర్ వల్లి సౌభాగ్యం, ఉమామహేశ్వరి, ఎన్సిసీ అధికారి డాక్టర్ విజయ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధిపతి డాక్టర్ అశ్విని, వివిధ విభాగాల అధిపతులు, కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.