Revanth Reddy | కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిపాలనా వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలని, డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి అవసరమైన చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు, వారి జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్‌పై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ 100 రోజుల్లోగా నివేదిక సమర్పించి, ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని సీఎం గడువు విధించారు.
ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున చెల్లింపులు జరిగినప్పటికీ, సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధించే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను గట్టిగా ఆదేశించారు.
