విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయాలి..
మునుగోడు, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కోశాధికారి గోపగోని ఉదయ్ పిలుపునిచ్చారు.
మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కోరారు.
ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టం–2009ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షుడు యాట శ్రీకాంత్, ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు కిరణ్, పీఎన్‌ఎం జిల్లా నాయకుడు పగిళ్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
