భూ పరీక్షల నివేదికల ఆధారంగానే పనులు చేపడతాం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా నారాయణపేట–మక్తల్–కొడంగల్ జీవో 69 ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ పెద్ద చెరువు విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గ్రామంలో సీపేజ్ సమస్యపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఊట్కూర్ పెద్ద చెరువు ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో నీరు నిల్వ ఉన్న సమయంలో గ్రామంలోని పలు ప్రాంతాల్లో భూమి అడుగు భాగం నుంచి నీరు కారడం, ఇళ్ల వద్ద జల ఉండడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా చెరువు విస్తరణ అనంతరం ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందంటూ ప్రజలు ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదునేపథ్యంలో సమస్యను సాంకేతికంగా పరిశీలించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ప్రొఫెసర్లు రమణమూర్తి, వెంకటరమణ బృందం శనివారం ఊట్కూర్ చేరుకుని పెద్ద చెరువుపరిసర ప్రాంతాలను పరిశీలించారు. గ్రామంలోని సీపేజ్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించింది. చెరువు కట్ట నిర్మాణ పరిస్థితులు, భూగర్భ జలాల ప్రభావం, గ్రామానికి ఉండే ప్రమాదాలపై అధ్యయనం నిర్వహించినట్లు తేలింది. అధికారుల బృందం రావడంతో అఖిలపక్షం బృందం నిపుణులతో సమస్యలు వివరించి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే గ్రామంలో ఊట నీరు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా పనులు చేపడితే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు వస్తే మాత్రం ప్రాజెక్టు గండి కొడతామని బిజెపి, బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించక ముందే డిపిఆర్ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.అనంతరం నిపుణుల బృందం నాయకులు ఊట్కూర్ పెద్ద చెరువు రెండో తూము లీకేజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల అభ్యంతరాలు ఆందోళనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. సీపేజ్ సమస్యపై నిపుణుల బృందం సమగ్ర నివేదిక అందించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
చెరువు విస్తరణ పనుల్లో గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వివరించారు. చెరువు చుట్టూ నిపుణుల నివేదిక ఆధారంగా పనులు చేపడతామని స్పష్టం చేశారు. గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊట రాకుండా పగడ్బందీగా పనులు చేపడుతున్నట్లు వివరించారు. భూ పరీక్షలు ఆధారంగానే పనులు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, ఎస్ ఈ శ్రీధర్, ఈ ఈ కేతన్, ఏఈలు ప్రదీప్, హజం, రాఘవ కన్స్ట్రక్షన్ జిఎం నాగేశ్వరరావు, ఆర్ఎం రాజేష్, నాయకులు భాస్కర్, అరవింద్ కుమార్, భరత్, విజయ్ కుమార్, కృష్ణయ్య గౌడ్, లక్ష్మారెడ్డి, ఆశప్ప, లక్ష్మారెడ్డి, శివారెడ్డి, ఆనంద్ రెడ్డి ఈబాధూర్ రెహమాన్, హన్మంతు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
