జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

జిల్లాలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన..
రహదారులు జలమయం
వేసవి ఉక్కపోతకు తాత్కాలిక ఉపశమనం

విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్ది సేపటికే నగరంలోని పలు రహదారులు నీటితో నిండిపోయి జలమయమయ్యాయి.

భారత వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం, దానికి అనుబంధంగా ఉన్న ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ప్రత్యేకంగా వర్షంతో పాటు కురిసిన వడగళ్ల వాన ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎండ తీవ్రతతో అలసిపోయిన ప్రజలు ఒక్కసారిగా చల్లబడిన వాతావరణాన్ని ఆస్వాదించారు.

పిల్లలు, పెద్దలు బయటకు వచ్చి వడగళ్లను సేకరిస్తూ ఆనందంగా గడిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో కొంత ఊరట లభించినప్పటికీ, ఈదురు గాలులు, వర్షం కారణంగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply