officers | ఎంజీఎంకు తరలింపు

officers | ఎంజీఎంకు తరలింపు

ఇద్దరు ఫారెస్ట్ బీట్ అధికారులకు తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
పలిమెల మండలం లెంకలగడ్డ వద్ద ఘటన…
ప్రమాదంపై అనుమానాల వెల్లువ

officers | పలిమెల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖకు చెందిన ఇద్దరు బీట్ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని చంద్రశేఖర్, శ్రీకాంత్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఇటీవలే పలిమెల అటవీ శాఖలో బీట్ అధికారులుగా బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. గురువారం అటవీ ప్రాంతంలో ఇన్స్పెక్షన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో ఇద్దరికీ తలకు తీవ్ర గాయాలు కాగా, చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా మారింది. తలకు గాయాలతో పాటు ముక్కు, చెవుల నుంచి రక్తస్రావం కావడంతో ఆయనను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరో అధికారి శ్రీకాంత్‌ను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అటవీ శాఖ అధికారుల వాహనాన్ని బొలెరో ఢీకొట్టిన ఘటనపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది సాధారణ రోడ్డు ప్రమాదమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గాయపడిన అధికారులను సమయానికి ఆసుపత్రికి తరలించిన పలిమెల పోలీసుల చర్యలను స్థానికులు ప్రశంసిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply