పోలీస్ ఏఆర్ఎస్ఐ గుండెపోటుతో మృతి
37 ఏళ్లుగా పోలీస్ శాఖలో సేవలందించిన శామ్యూల్
వరంగల్, ఆంధ్రప్రభ: వరంగల్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్. శామ్యూల్ (57) శనివారం ఉదయం హనుమకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట జంక్షన్ వద్ద ఉన్న తన నివాసంలో ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు.
విధులకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్న సమయంలో ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
శామ్యూల్ 1989లో పోలీస్ శాఖలో విధుల్లో చేరారు. సుమారు 37 ఏళ్లుగా పోలీస్ శాఖలో సేవలందించారు.
ఆయన మృతి పట్ల పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శామ్యూల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
