పోలీసింగ్‌పై కేంద్రం ఫోకస్!

దేశవ్యాప్తంగా పరిశీలన.. తెలంగాణ, ఏపీలో క్షేత్రస్థాయి తనిఖీలు

రాష్ట్రాలకు క్యూసీఐ బృందాలు.. రేపటి నుంచి పోలీస్‌స్టేషన్లలో పరిశీలన

సైబర్, ట్రాఫిక్, స్టేషన్ల ఆధునికీకరణపై దృష్టి.. 200 అంశాలపై ఆరా

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా స్మార్ట్ పోలీసింగ్ అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం నివేదికలు కోరింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) బృందాలు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌తో కలిసి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చాయి. స్మార్ట్ పోలీసింగ్, పోలీస్‌స్టేషన్ల ఆధునికీకరణ, సైబర్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించనున్నారు.

తెలంగాణకు క్యూసీఐ బృందాలు

తెలంగాణలో స్మార్ట్ పోలీసింగ్ అమలు, పోలీస్‌స్టేషన్ల ఆధునికీకరణతో పాటు పౌరులకు అందుతున్న సేవలపై క్యూసీఐ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు సేవలను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించనున్నారు.

8 కమిషనరేట్లలో పరిశీలన

తెలంగాణలోని ఎనిమిది కమిషనరేట్ల పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌స్టేషన్లను క్యూసీఐ బృందాలు మంగళవారం నుంచి పరిశీలించనున్నాయి. సైబరాబాద్, రాచకొండ, రామగుండం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట కమిషనరేట్లలోని పోలీస్‌స్టేషన్లను సందర్శించనున్నారు.

ఏపీలో ఐదు యూనిట్లలో

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందాలు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు యూనిట్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లను సందర్శించనున్నాయి. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం జిల్లాల్లోని పోలీస్‌స్టేషన్లను పరిశీలించనున్నాయి.

200 అంశాలపై ఆరా

క్యూసీఐ బృందాలు పోలీస్‌స్టేషన్లను సందర్శించిన సమయంలో సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను పలు అంశాలపై వివరాలు అడిగి తెలుసుకోనున్నాయి. ఇందుకోసం 200 ప్రశ్నలను క్యూసీఐ బృందాలు సిద్ధం చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో పోలీస్‌స్టేషన్ల పరిశీలన అనంతరం స్మార్ట్ పోలీసింగ్ అమలుపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి.

రామగుండం కమిషనరేట్‌లో..

రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, ఎన్టీపీసీ, గోదావరిఖని టూ టౌన్ పోలీస్‌స్టేషన్లతో పాటు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణ, కన్నెపల్లి పోలీస్‌స్టేషన్లను క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందాలు మంగళవారం సందర్శించనున్నాయి.