కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా
జైల్భరో కార్యక్రమంలో నాయకుల అరెస్టు
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం తొర్రూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, పని దినాలను పెంచాలని కోరారు.
రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించాలని డిమాండ్ చేశారు. అర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తాగునీటి సరఫరాతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైల్భరో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు ర్యాలీని బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వరకు కొనసాగించి, అనంతరం బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులు నాగయ్య, బొల్లం అశోక్, యాకూబ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
