నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం

తారా డిగ్రీ కళాశాలలో హెలిప్యాడ్‌.. అంబేద్కర్‌ స్టేడియంలో సభ
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, కలెక్టర్‌, ఎస్పీ

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనలో భాగంగా తారా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను, అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించనున్న సభా ప్రాంగణాన్ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రతిక్‌ జైన్‌, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా భద్రత, సభా ఏర్పాట్లు, ఇతర అవసరాలపై వారు అధికారులతో సమీక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.