రూ.20 లక్షల ఆర్థిక సాయం
- మెడికో ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు
- జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడిన సీఎం
- కేసు దర్యాప్తు అంశాలను వివరించిన అధికారులు
అమరావతి, ఆంధ్రప్రభ: రాజమండ్రిలో ఈ నెల 3న యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాటి ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి… ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు.
ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని ఎస్పీ వివరించగా…. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు వివరించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని సీఎం తెలిపారు.
