మాదక ద్రవ్యాలు, సైబర్‌ నేరాలపై ఉక్కుపాదం

    భూపాలపల్లి, ఆంధ్రప్రభ: మాదక ద్రవ్యాలు, సైబర్‌ నేరాలు సమాజానికి పెను సవాళ్లుగా మారుతున్నాయని, వాటిని అరికట్టేందుకు పోలీసులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీసు అధికారులతో క్రైమ్‌ రివ్యూ నిర్వహించిన అనంతరం ఆదివారం భూపాలపల్లి ఎస్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

    ప్రస్తుతం డ్రగ్స్‌ చిన్న పట్టణాలు, గ్రామాలకూ విస్తరిస్తున్నాయని, భవిష్యత్‌ తరాలను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పెడ్లర్లు, రవాణాదారుల సమాచారం ప్రజలు పోలీసులకు అందించాలని కోరారు.

    సైబర్‌ నేరాలతో రూ.1,750 కోట్ల నష్టం

    గత ఏడాది రాష్ట్రంలో ఆస్తి నేరాల వల్ల సుమారు రూ.250 కోట్ల నష్టం జరిగితే.. సైబర్‌ నేరాల కారణంగా ప్రజలు ఏకంగా రూ.1,750 కోట్ల వరకు నష్టపోయారని డీజీపీ వెల్లడించారు. రిటైర్మెంట్‌ తర్వాత వచ్చిన డబ్బులు, జీవితకాల సంపాదనను మోసగాళ్లకు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.

    తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

    మావోయిజం దాదాపు నియంత్రణలోకి

    గతంలో భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేదని డీజీపీ గుర్తుచేశారు. ప్రస్తుతం మావోయిజం దాదాపు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని, దేశవ్యాప్తంగా మిగిలిన క్యాడర్‌ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని తెలిపారు.

    సరెండర్‌ అయిన మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వారికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆరోగ్య కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

    బాధిత కుటుంబాల కోసం ‘టీజీ బీర్‌’ యాప్‌

    నక్సలైట్‌ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు ‘టీజీ బీర్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఇళ్ల స్థలాలు, పట్టాల రిజిస్ట్రేషన్‌, ఎక్స్‌గ్రేషియా వంటి సమస్యలను కుటుంబ సభ్యులు యాప్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

    ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి

    ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, సైబర్‌ పెట్టుబడి మోసాల్లో చిక్కుకుని అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారని డీజీపీ హెచ్చరించారు. చివరకు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని, పోలీసు సిబ్బందికి కూడా ప్రత్యేక కౌన్సెలింగ్‌ అవసరమని పేర్కొన్నారు.

    రోడ్డు భద్రతకు ప్రాధాన్యం

    ట్రాఫిక్‌ నిర్వహణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్‌ మేనేజ్‌మెంట్‌, రోడ్‌ సేఫ్టీ బ్యూరో ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

    కల్తీ ఆహారంపై ప్రత్యేక నిఘా

    కల్తీ ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని, వాటి తయారీ, రవాణా, సరఫరాపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. సివిల్‌ సప్లయిస్‌లో అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు.

    పోలీస్‌ శాఖకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచాలని, గస్తీ, పెట్రోలింగ్‌ వ్యవస్థలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

    ప్రజల్లో పోలీస్‌ శాఖపై నమ్మకం పెరిగేలా ప్రతి అధికారి, సిబ్బంది పనిచేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. అనంతరం ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ సిబ్బందికి హెల్మెట్లు అందజేసి, జిమ్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

    ఈ కార్యక్రమంలో మల్టీ జోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌ఐబీ ఐజీ ఎల్‌.కార్తికేయ, రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌, ములుగు ఎస్పీ సుధీర్‌ రామ్‌నాథ్‌ కేకన్‌, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.