డా. ప్రియాంక మృతి బాధించింది: పవన్ కల్యాణ్
అమరావతి, ఆంధ్రప్రభ: రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
మద్యం మత్తులో యువకులు కారును నిర్లక్ష్యంగా నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైద్యురాలిగా ఎంతో మందికి సేవలు అందించాల్సిన ఆమె అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు.
నిర్లక్ష్యంగా కారు నడిపి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.
