విధేయతకు పట్టం

  • ఎస్వీబీసీ చైర్మన్ గా శ్రీధర్ వర్మ
  • పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీతో అనుబంధం
  • రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా కీలక సేవలు
  • ఎన్టీఆర్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం
  • శ్రీధర్ వర్మకు నేతల అభినందనలు

తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న శ్రీధర్ వర్మకు సముచిత గుర్తింపు లభించింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న శ్రీధర్ వర్మ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

పార్టీ ఆవిర్భావం నుంచి అనుబంధం..

శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో పాలకమండలి సభ్యుడిగా సేవలందించారు. దీంతో శ్రీధర్ వర్మ కుటుంబానికి టీడీపీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగుతోంది. ఎన్టీఆర్ కుటుంబంతోనూ ప్రత్యేక అనుబంధం ఉంది.

పార్టీ కోసం నిరంతర సేవలు..

శ్రీధర్ వర్మ గతంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి ఎస్వీబీసీ చైర్మన్‌గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.

శ్రీవారి సేవ భాగ్యం..

ఎస్వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు దక్కడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని శ్రీధర్ వర్మ తెలిపారు. శ్రీవారికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని తాను మొదటి నుంచి పార్టీ పెద్దలను కోరుతూ వచ్చానన్నారు. తనకు ఈ బాధ్యతలు రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో పాటు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్వీబీసీపై అవగాహన పెంచుకుని ఛానల్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

ఎమ్మెల్యేను కలసిన శ్రీధర్ వర్మ..

ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ ఆదివారం పలమనేరు ఎమ్మెల్యే నూతనకాలువ అమర్‌నాథ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీకి విధేయుడిగా పనిచేసినందుకు తగిన గుర్తింపు లభించిందని అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు ఎల్లప్పుడూ ఆశీస్సులు ఉండాలని శ్రీధర్ వర్మ కోరారు. అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ తదితరులు శ్రీధర్ వర్మను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.