దేవాలయ పరిసర ప్రాంతాలలో కోతులను వదలద్దు

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పరిసర ప్రాంతాల లో కోతులను వదలరాదని ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రేగటి నాగరాజు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, పరిసర ప్రాంతాల లో, కోతుల సంఖ్య అధికంగా పెరిగి భక్తులకు, స్థానికులకు , ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న దుకాణదారులకు, హోటల్ నిర్వాహకులకు, తినుబండారాల వ్యాపారుల కు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు ఇతర ప్రాంతాల నుండి కోతులను తీసుకువచ్చి దేవస్థానం పరిసర ప్రాంతాల లో వదులుతున్నారని వారు తెలిపారు.

ఇటువంటి చర్యల వలన కోతుల బెడద మరింత పెరిగి భక్తుల భద్రతకు, వ్యాపార కార్యకలాపాలకు మరియు దేవస్థానం ప్రశాంత వాతావరణానికి అంతరాయం కలిగిస్తున్నాయని తెలిపారు. కావున ఎవరూ ఇతర ప్రాంతాల నుండి కోతులను తీసుకువచ్చి దేవస్థానం పరిసర ప్రాంతాలలో వదలరాదన్నారు. ఇప్పటికే పట్టుబడిన లేదా తరలించ వలసిన కోతులను అటవీ శాఖ నిబంధనల ప్రకారం తగిన అటవీ ప్రాంతాలలో మాత్రమే విడిచి పెట్టాలన్నారు. దేవస్థానం పరిసర ప్రాంతాలలో కోతులను వదిలినట్లు లేదా అటువంటి చర్యలకు సహకరించినట్లు గుర్తించిన యెడల సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply