దుర్గగుడికి దక్కనున్న టీటీడీ స్థలం..

దుర్గగుడికి దక్కనున్న టీటీడీ స్థలం..

రూ.100 కోట్ల విలువైన స్థలం ఇచ్చేందుకు ధాత అంగీకారం..
నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెర..
దాత కుటుంబాన్ని ఒప్పించిన ఎంపీ కేసినేని శివనాథ్..
టీటీడీ–దుర్గగుడి మధ్య స్థల బదిలాయింపుకు అవకాశం.
భక్తుల వసతి సముదాయాల ఏర్పాటుకు మార్గం సుగమం
కృష్ణా పుష్కరాల నాటికి మౌలిక సదుపాయాల ఏర్పాటు.

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నాలుగు దశాబ్దాలుగా ఎటువంటి వినియోగానికి ఉపయోగించని కోట్ల రూపాయల విలువైన స్థలం దుర్గగుడి ఆస్తిగా మారనుంది. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీకి చెందిన అత్యంత విలువైన స్థలాన్ని దుర్గగుడి దేవస్థానానికి బదలాయించే ప్రక్రియకు మళ్లీ ఊపిరి లభించింది. భక్తుల వసతి, మౌలిక సదుపాయాల విస్తరణకు అత్యంత అనువైన స్థలాన్ని దుర్గ గుడికి అందించేందుకు దాతలు ముందుకు వచ్చి అంగీకారం తెలిపారు.

రూ 100 కోట్ల విలువైన స్థలం..

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కుమ్మరిపాలెం సెంటర్‌లో ఉన్న స్థలాన్ని సుమారు 40 ఏళ్ల క్రితం నగరానికి చెందిన ప్రముఖ దాత సమా సాంబశివరావు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందజేశారు. ఆ సమయంలో ఆ స్థలంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో టీటీడీ ముందుకు వచ్చినప్పటికీ, పరిస్థితుల మార్పుతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టడంతో కుమ్మరిపాలెం స్థలంపై ప్రణాళికలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇదే సమయంలో జాతీయ రహదారి, ఫ్లైఓవర్ నిర్మాణాల కారణంగా స్థలంలో కొంత భాగం కోల్పోయినా, మిగిలిన రెండు ఎకరాలకు పైగా భూమి ఇప్పటికీ అత్యంత విలువైన ఆస్తిగా కొనసాగుతోంది. అమ్మవారి ఆలయానికి అత్యంత సమీపంలో ఉండటం, భక్తుల అవసరాలకు అనువైన ప్రాంతంలో ఉండటంతో ఈ స్థలాన్ని దుర్గగుడికి కేటాయించాలని గత కొన్నేళ్లుగా పలు వర్గాల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. టీటీడీకి ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతంలో భూమి కేటాయించే ప్రతిపాదనలు కూడా చర్చకు వచ్చినప్పటికీ, దాతల అభ్యంతరాలతో విషయం ముందుకు సాగలేదు.

పరిష్కరించేందుకు ముందుకు వచ్చిన ఎంపీ..

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసినేని శివనాథ్, దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ కలిసి దాత కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రానున్న కృష్ణా పుష్కరాల నాటికి భక్తుల కోసం ఆధునిక వసతి సదుపాయాలు, సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించి, ఈ స్థలాన్ని దేవస్థాన అవసరాలకు వినియోగించేందుకు అంగీకారం తెలపాలని కోరారు. సమావేశంలో దాత కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. స్థలాన్ని దేవస్థానానికి వినియోగించే పక్షంలో అక్కడ నిర్మించే భవన సముదాయానికి దాత పేరు పెట్టాలని వారు సూచించినట్లు సమాచారం. దీనిపై ఎంపీ కేసినేని శివనాథ్ సానుకూలంగా స్పందిస్తూ, త్వరలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి అంశాన్ని తీసుకెళ్లి టీటీడీ అధికారులతో చర్చలు జరిపి తుది నిర్ణయానికి తీసుకువస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

ఎంతో ఉపయోగకరంగా..

ప్రస్తుతం ఇంద్రకీలాద్రికి వచ్చే లక్షలాది మంది భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి సముదాయాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ఈ భూమి దుర్గగుడికి దక్కితే బహుళ అంతస్తుల వసతి సముదాయాలు, టికెట్ బుకింగ్ కేంద్రాలు, సమాచార కేంద్రం, యాత్రికుల విశ్రాంతి మందిరాలు, పార్కింగ్ సదుపాయాలు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడనుంది. దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ఈ అంశం చివరకు సానుకూల మలుపు తిరుగుతుండటంతో భక్తులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు ముందే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దుర్గగుడి చరిత్రలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశముంది.