ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన…

ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన…
లైవ్ డెమో ద్వారా పరీక్షల పనితీరును వీక్షించిన ఈవో
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండ చరియల పటిష్టతపై అధ్యయనం చేస్తున్న బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తల బృందం శనివారం క్షేత్రస్థాయిలో కీలక పరిశీలనలు జరిపింది. సైంటిస్ట్ శ్రీ ప్రసన్న జైన్ నేతృత్వంలోని బృందం, ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిలోని వివిధ ప్రాంతాలను సందర్శించింది. ముందుగా ఓం టర్నింగ్ సమీపంలోని కొండ చరియలను, అలాగే ఘాట్ రోడ్ మొదటి మలుపు వద్ద ఉన్న ప్రమాదకర ప్రాంతాలను బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తాము ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాల పనితీరును ఈవోకి వివరించారు. కొండ చరియల్లో ఉన్న మట్టి శాతం, తేమ రాళ్ల పటుత్వాన్ని ఈ పరికరాలు ఏ విధంగా లెక్కిస్తాయో ‘లైవ్ డెమో’ ద్వారా చూపించి, ఆ ఫలితాలను వివరించారు. అనంతరం బృందం హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న కొండపైకి కాలినడకన ఎక్కి, ప్రతిపాదిత ‘రెండవ ఘాట్ రోడ్’ మార్గంలో రాతి, మట్టి నమూనాలను పరీక్షించింది.

అభివృద్ధి పనులకు ఈ సర్వే నివేదికే ‘బ్లూ ప్రింట్’
ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ ఈ సర్వే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సర్వే నివేదిక కేవలం భక్తుల భద్రత కోణంలోనే కాకుండా, భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై చేపట్టబోయే ప్రతి అభివృద్ధి పనికి ఒక ‘బ్లూ ప్రింట్’ లాగా ఉపయోగపడుతుందని ఈవో స్పష్టం చేశారు. ప్రఖ్యాత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐఆర్ఎఫ్ ఆధ్వర్యంలో పూర్తి శాస్త్రీయతతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇంద్రకీలాద్రి చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఈ సమగ్ర అధ్యయనం, కొండ భద్రతను కాపాడుతూనే ఆధ్యాత్మిక క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసేలా బృహత్తర నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ సర్వే ద్వారా వచ్చే నివేదిక ఆధారంగా, ఇంద్రకీలాద్రిని అత్యంత సురక్షితమైన, సుందరమైన యాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు దేవస్థానం అన్ని చర్యలు తీసుకోనుందని తెలిపారు.


