జలవనరుల ఆక్రమణలకు చెక్..!

జలవనరుల ఆక్రమణలకు చెక్..!
సమన్వయ శాఖల అధికారులకు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశాలు
ఆంధ్రప్రభ, విజయవాడ: జల వనరుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కాలువలు, చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరులపై ఆక్రమణలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని.. అత్యంత పారదర్శకతతో నిర్వహించే క్షేత్రస్థాయి తనిఖీలు, పరిశీలనల నివేదికలు సమగ్ర కార్యాచరణకు కీలకమని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
జల వనరుల సంరక్షణ, ఆక్రమణల గుర్తింపు, తొలగింపునకు సంబంధించి కలెక్టర్ లక్ష్మీశ.. శుక్రవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, జల వనరులు తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులతో కలిసి వర్చువల్గా హాజరయ్యారు. ఈ సమావేశంలో జల వనరుల సంరక్షణకు సంబంధించి గౌరవ ఏపీ హైకోర్టులో 2024లో దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపైనా చర్చించారు. జలవనరుల ఆక్రమణల వల్ల పర్యావరణ సమస్యలతో పాటు వరద ముప్పులు, భూగర్భ జలాల తగ్గుదలకు దారితీస్తాయని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాలువలు, డ్రైన్లు, చెరువులు తదితర జలవనరుల పరిరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రత్యేక కమిటీ సంయుక్త తనిఖీలు, సర్వేలకు సంబంధించిన నివేదికలు అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రూపొందించాలన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరక్కుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో డీసీపీ కేజీవీ సరిత, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, డీపీవో పి.లావణ్యకుమారి, ఇరిగేషన్ స్పెషల్ డివిజన్ ఈఈ బి.ఆంజనేయ ప్రసాద్, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.
