TG | రేవంత్ తీరుతో ఈ దుస్థితి… ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ – వేస‌వి రాక‌ముందే గోదారిని ఏడారి చేశారంటూ రేవంత్ స‌ర్కార్ పై మండిప‌డ్డారు ఎమ్మెల్సీ క‌విత.. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై క‌క్షలో భాగంగా సజీవ‌జ‌ల‌ధార‌ను వ‌ట్టిబోయేలా చేశారంటూ విమ‌ర్శించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వహిస్తున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు వంద కి.మీ. పొడవునా గోదావరిని బీఆర్ఎస్ ప్రభుత్వం సజీవ జలధారగా మార్చిందని గుర్తు చేశారు.

మండే ఎండాకాలంలోనూ నిండు కుండలా కలకళలాడేలా చేసిందన్నారు. కానీ కేసీఆర్ పై కక్షతో కాళేశ్వరం బ్యారేజీలను కాంగ్రెస్ సర్కారు ఎండబెట్టిందని మండిపడ్డారు. 2014కు ముందులా ఫిబ్రవరిలోనే గోదావరి పట్టిపోయి ఎడారిని తలపిస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇప్పుడే ఇట్లా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా మారుతుందోన‌ని ఆవేదన వ్యక్తం చేశారు. తలాపునే గోదావరి ఉన్నా, గుక్కెడు నీటి కోసం మళ్లీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం ‘గ్యారెంటీ’గా తెచ్చిందని విమర్శించారు.

కేసీఆర్ హయాంలో నిండుకుండలా నీటితో కళకళలాడిన గోదావరి నది.. వేసవి రాకముందే ఎడారిని తలపిస్తోంది. సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ తో గతంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోల్ బెల్ట్ బ్రిడ్జి వద్ద నిండుగా నీళ్లు ఉండేవి. ప్రస్తుతం ఆ బ్యారేజీలో కాంగ్రెస్ సర్కార్ నీటిని నిల్వ చేయకపోవడంతో అక్కడి గోదావరిలో చిన్న ప్రవాహమే ఉంది. నదిలో ఇసుక తెన్నాయి. దీనికి సంబంధించి ఓ స్క్రీన్ కూడా ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *