శ్రీ అమృతేశ్వరుని చెంత కొర్రపాటిచే ఘనంగా వారాహి వేడుకలు

- ఆకట్టుకున్న పురాణపండ శ్రీమాలిక మహాగ్రంథం
బళ్లారి, (ఆంధ్రప్రభ) : కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి పట్టణంలో భక్తులపాలిట వారాహి మాత కల్పతరువై కరుణిస్తోందన డానికి ఈ ఆషాడ గుప్త నవరాత్రుల్లో తొలిసారి బళ్లారి శ్రీఅమృతేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించిన వారాహి నవరాత్రోత్సవాలు శుక్రవారం నిర్వహించిన కుంకుమార్చన, పూర్ణాహుతితో వైభవంగా ముగిసింది.
దీంతో వారాహి కారుణ్యం నిరూపణ అయ్యినట్లయ్యిందని భక్తబృందాలు జేజేలు పలకడం విశేషం. తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో ప్రముఖ సినీ నిర్మాతలుగా విశేషఖ్యాతి సంపాదించుకున్న వారాహి చలనచిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి తమ సొంత ఊరైన బళ్లారిలో గత సంవత్సరం కోట్లాది రూపాయలతో నిర్మించిన శ్రీఅమృతేశ్వరస్వామి ఆలయం ద్వారా భక్తులకు చేస్తున్న పరమోత్తమ కార్యాలకు వందలకొలది మహిళా భక్తులు నీరాజనం పడుతున్నారనడానికి శుక్రవారం ఉదయం జరిగిన కుంకుమార్చన సాక్ష్యంగా నిలిచింది.
గత ఎనిమిది రోజులుగా వివిధ అలంకారాలు, వివిధ నైవేద్యాలతో పూజార్చనలు అందుకున్న శ్రీఅమృతేశ్వరాలయంలోని వారాహి అమ్మవారి పట్ల సాయికొర్రపాటి దంపతులు చూపిన శ్రద్ధ భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించిదనడంలో సందేహం లేదు. స్పష్టమైన ఉచ్ఛారణ కలిగిన వేదపండితుల పూజలు, హోమాలు సైతం ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా మొదటి రెండు రోజులూ భక్తులకు ఉచితంగా సుమారు నాలుగు వందల పేజీల అమోఘమైన శ్రీమాలిక గ్రంథాన్ని శ్రీఅమృతేశ్వర ఆలయం పక్షాన సాయి కొర్రపాటి బహూకరించడం వారాహి దీక్షా మాల ధారుల్ని విశేషంగా ఆకర్షించింది.
దేశదేశాల తెలుగు వారిలో లక్షలమంది ఫాలోయర్స్ ఉన్న ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనంగా అందించిన ఈ శ్రీమాలిక గ్రంథంలో శ్రీనృసింహ స్వామి ఆవిర్భావఘట్టం భక్త పాఠకులకు ఒళ్లు గగుర్పొడిచేలా అద్భుతంగా అందించారని భక్తులు శ్రీఅమృతేశ్వర ఆలయంలోనే సుమారు గంటసేపు పారాయణం చెయ్యడం ప్రత్యేకాంశంగా పేర్కొనక తప్పదు.
సాయి కొర్రపాటి, రజని కొర్రపాటిల సమర్పణలో విశేషాంశాలతో అందిన ఈ శ్రీమాలిక మహాగ్రంథంలో తిరుమలకు సంబంధించిన ఎన్నో ప్రత్యేకాంశాలతో రూపొందడం, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, శ్రీశైలం భ్రమరాంబ వంటి ఎందరో దేవీదేవతల స్తోత్ర వ్యాఖ్యానాలతో అందడం పట్ల పురాణపండకు, కొర్రపాటికి భక్తబృందాలు కృతజ్ఞతలు తెలిపాయి. కర్ణాటక రాష్ట్ర రాజకీయ ప్రముఖులు, ప్రఖ్యాత పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి దంపతులు ఈ పూజార్చనల్లో పాల్గొనడం విశేషం.


