Vaccination | ప్రారంభమైన హెచ్.పీ.వీ వాక్సినేషన్

Vaccination | ప్రారంభమైన హెచ్.పీ.వీ వాక్సినేషన్

Vaccination | గుంటూరు, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లాలో హ్యూమన్ పాపిలొమా వైరస్ (హెచ్.పి.వి) వాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం అయింది. గుంటూరు పట్టణం పట్టాభి గార్డెన్స్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగుపెట్టిన బాలికలకు వాక్సినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు.

మహిళలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ (సెర్వికల్ క్యాన్సర్ ) దేశంలో ప్రధాన శత్రువుగా ఉందన్నారు. దానిని నివారించుటకు ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్ర మోడీ అజ్మీర్ లో వాక్సినేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారని, అదే రోజు విజయనగరంలో ముఖ్యమంత్రి ప్రారంభించారని వివరించారు. 90 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 83 కోల్డ్ చైన్ పాయింట్స్ ఉన్న పి.హెచ్.సీలు, సి.హెచ్.సిలు తదితర ఆసుపత్రుల వద్ద పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

Vaccination |
Vaccination |

ఒక్క వ్యాక్సిన్ ఖరీదు 4 వేలు రూపాయలు అని, అయినప్పటికీ ఆరోగ్యమే మహా భాగ్యంగా ప్రభుత్వం అర్హులైన బాలికలకు అందించుటకు ముందుకు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో 14,167 మంది బాలికలు ఉన్నట్లు అంచనా అని, 21,170 డోసులు అవసరమని అంచనా వేశారని ఇప్పటి వరకు 6,793 డోసులు జిల్లాకు అందాయని తెలిపారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా అందరూ అంకితభావంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. వాక్సినేషన్ తీసుకున్న బాలికలకు వారి స్నేహితులకు తెలియజేయాలని సూచించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి మాట్లాడుతూ 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు (14వ పుట్టినరోజు పూర్తి చేసి, 15వ పుట్టినరోజు ఇంకా జరుపుకోని వారు) అర్హులన్నారు. మధ్యస్థ లేదా తీవ్రమైన అనారోగ్యం ఉన్న బాలికలు, పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే టీకా ఇవ్వాలన్నారు. మునుపటి టీకాకు అలర్జీ వచ్చిన వారు లేదా ఈస్ట్ అలర్జీ ఉన్నవారు, గర్భిణీలు (Pregnancy) తీసుకోరాదని చెప్పారు.

వీరి టీకా వివరాలు U-WIN పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని అన్నారు. టీకా తీసుకునే బాలికలు ఆహారం తీసుకుని ఉండాలని, ఖాళీ కడుపుతో ఉండకూడదన్నారు. పిల్లలు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే తల్లిదండ్రులు టీకా కేంద్రానికి పంపాలని సూచించారు. టీకా తీసుకున్న బాలికలు కనీసం 30 నిమిషాలు అక్కడే ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి శ్రావణ్ బాబు, డి.పి.ఎం.ఓ సుజాత, తహసిల్దార్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ MORE : 7402acres | పప్పు ధాన్యాలతో లాభాలెన్నో…!

CLICK HERE TO READ MORE :

Leave a Reply