108 అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం
- మార్గమధ్యలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణి
- ఈఎంటీ చంటి సమయస్ఫూర్తితో తల్లీబిడ్డలు క్షేమం
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 108 అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఓ గర్భిణికి అంబులెన్స్‌లోనే సురక్షిత ప్రసవం జరిగింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
జిల్లాలోని గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన జెల్ల అంజలి (20)కి మంగళవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఆమెను భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు తీవ్రంగా పెరిగాయి.
పరిస్థితిని వెంటనే గుర్తించిన ఈఎంటీ చంటి సమయస్ఫూర్తితో అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అంజలి పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం తల్లీబిడ్డలను మెరుగైన వైద్య పరీక్షలు, సంరక్షణ కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సమయానికి సేవలందించిన ఈఎంటీ చంటి, అంబులెన్స్ పైలెట్ రాజేందర్ సేవలను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు. అత్యవసర సమయంలో వేగంగా స్పందించి సురక్షిత ప్రసవం నిర్వహించిన 108 సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
