15 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం
మంగళగిరి, ఆంధ్రప్రభ: అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు సాయం అందేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ బాధితులకు అందజేశారు.
మొత్తం 15 మంది లబ్ధిదారులకు రూ.12.78 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ సమస్యలను గుర్తించి స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
