ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం

ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం

ఉట్నూర్, ఆంధ్రప్రభ: వాతావరణ మార్పులతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో గత రెండు రోజులుగా సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. పగలంతా ఎండల తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయంత్రం కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి.

ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం వేళ వాతావరణంలో మార్పులు ఏర్పడి ఈదురుగాలులు, చిరుజల్లులతో చల్లటి వాతావరణం నెలకొంటోంది.

అకాల వర్షాల కారణంగా రెండు రోజులుగా సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తోంది. వర్షాలతో రైతులు కూడా తమ పంట పొలాలను చదును చేస్తూ ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసీ రైతులు తమ సాంప్రదాయ పద్ధతుల్లో ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం విత్తనాలను కులదేవతల వద్ద ఉంచి పూజలు చేస్తున్నారు. కులదేవతల వద్ద పూజ చేసిన విత్తనాలనే తమ పంట పొలాల్లో విత్తుతామని ఆదివాసీ రైతులు పేర్కొంటున్నారు.

Leave a Reply