Utnoor గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

Utnoor గిరిజనుల పునరావాస సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

  • ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు

ఉట్నూర్ (Utnoor), ఆంధ్రప్రభ: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం కడెం మండలానికి చెందిన గిరిజనులు భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందుకు తన కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. వారి సమస్యలను పీఓకు వివరించారు.

ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గిరిజనులు తమ పునరావాసానికి సంబంధించిన సమస్యలు, తాము అనేకసంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూముల పరిస్థితి, భూముల హక్కులు, జీవనోపాధికి సంబంధించిన ఇబ్బందులను ప్రాజెక్టు అధికారికి వివరించారు.గిరిజనుల సమస్యలను ఓర్పుతో విన్న ప్రాజెక్టు అధికారి, వారి వద్ద ఉన్న వినతి పత్రం లోని సంబంధిత అంశాలపై ఆరా తీశారు. ముఖ్యంగా పునరావాస ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, సాగు భూముల గుర్తింపు, భూ హక్కుల అంశాలు, ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

గిరిజనుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పరిగణిస్తోందని అన్నారు. గిరిజనులు వినిపించిన సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో), జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) తదితర సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని పి ఓ హామీ ఇచ్చారు.గిరిజనుల పునరావాసానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన అన్నారు . గిరిజనుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల మరియు హక్కుల పరిరక్షణ కోసం ఐటిడిఎ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

అలాగే గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా పరిష్కార మార్గాలు వేగవంతం అవుతాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నివేదికలను సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు వెల్లడించారు.ఈ సమావేశంలో ఐటిడిఎ అధికారులు, సిబ్బంది, కడెం మండలానికి చెందిన గోండు గిరిజనులు, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.