బీటీ రోడ్డు విస్తరణ పనులు తక్షణమే చేపట్టాలి

-మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

-జాతీయ రహదారిపై ధర్నా

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లాఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం, బిజ్వార్, నుండి మక్తల్ మండలంలోనిజక్లేర్ వరకు ఉన్న ప్రధాన రహదారి పనులను, తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. పెద్ద జట్రం నుండి జక్లేర్ వరకు గల 18 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్డును బీటీ డబుల్ గా మార్చాలని తక్షణమే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద జట్రం గ్రామపంచాయతీ సెంటర్ నుండి బైక్ ర్యాలీని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. కృష్ణ ప్రారంభించారు. ఈ రోడ్డును డబుల్ లైన్ గా మార్చితే ప్రజలకు అన్ని విధాల రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని అన్నారు. రోడ్డు బాగుంటే వాహనం బాగుంటుంది వాహనం బాగా వెళితే ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. తక్షణమే బీటీడబుల్ రహదారీ విస్తరణ పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన ఉదృతంగా చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.