విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- పాజిటివ్ కేసు నమోదు
- అప్రమత్తమైన వైద్యశాఖ
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలో మరోసారి కరోనా కలకలం రేగింది. నగరంలో ఓ వ్యక్తికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. సమాచారం ప్రకారం.. ఇటీవల అస్వస్థతతో బాధపడుతున్న సదరు వ్యక్తి ఓ జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యుడు అతడిని కోవిడ్ పరీక్షల కోసం ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు పంపించారు.
ప్రైవేట్ ల్యాబ్‌లో నిర్వహించిన పరీక్షల్లో అతడికి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతరం వైద్యాధికారుల సూచన మేరకు అదే శాంపిల్‌ను నిర్ధారణ కోసం కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కు పంపించారు. కేజీహెచ్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు కేసును అధికారికంగా నమోదు చేశారు. ఈ ఘటనతో వైద్యశాఖ అప్రమత్తమై, బాధితుడి ఆరోగ్య పరిస్థితి, అతని కాంటాక్ట్ హిస్టరీపై ఆరా తీస్తోంది.
నగరంలో కరోనా కేసు వెలుగుచూడడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు.
