Unnao Rape : మళ్లీ న్యాయం కోసం AndhraPrabha Real Analysis

Unnao Rape : మళ్లీ న్యాయం కోసం AndhraPrabha Real Analysis
సుప్రీం కోర్టు తలుపు తట్టిన.. ఉన్నవ్ బాధితురాలు
ఫాస్ట్ ట్రాక్ తీర్పు సస్పెన్షన్
హైకోర్టు బెయిల్ దేశవ్యాప్తంగా .. న్యాయ వ్యవస్థపై చర్చ
Unnao Rape | వందమంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇదీ భారతీయ శిక్ష్మాస్మృతి గొప్పతనం. నిజమే.. లక్షల మంది దోషులో కాదో తెలీదు.. ఇండియన్ జస్టిస్ రిపోర్టు ప్రకారం, 4.6 లక్షల మంది అండర్ ట్రయల్ ఖైదీలు ఏళ్లకు ఏళ్లుగా.. జైళ్లల్లోనే మగ్గుతున్నారు. కనీసం వీరికి బెయిల్ పూచీకత్తు కోరే న్యాయవాదులు లేరంటే.. కేవలం ఆరోపణ కాదు. భారత దేశంలో 20 లక్షలు పైగా న్యాయవాదులు ఉన్కారు. వీరెవరికీ అండర్ ట్రయల్ ఖైదీల గురించి తెలీదా? అంటే తెలుసు. కానీ అండర్ ట్రయల్ ఖైదీల గురించి వకల్తా తీసుకునే ఖాళీ దొరకదు, కానీ.. ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి ఓ ఎమ్మెల్యేని దోషిగా నిర్ధారించి.. పూర్తికాల జీవిత ఖైదు శిక్షను విధిస్తే.. ఆ శిక్షను కూడా తాత్కాలిక రద్దు కోసం వాదించిన న్యాయవాదులు..అసమాన్యులే. పకడ్బంధీ చట్టాన్నీ దోషికి అన్వయించగలరు. దోషిని జైలు నుంచి బయటకు తీసుకురాగలరు. ఒక్కసారి భారత దేశాన్ని కకావికలం చేసిన ఉన్నావ్ అత్యాచారం (Unnao Rape Case ) కేసులో తాజా పరిస్థితి… యావత్తు న్యాయ వ్యవస్థనే ప్రశ్నిస్తోంది.
( ఆంధ్రప్రభ, రియల్ అనాలసిస్)
ఔను.. ఉద్యోగార్థిగా తన కార్యాలయానికి వెళ్లిన మైనరు బాలికను ఆ ఎమ్మెల్యే మోసం చేశాడు. చెరిచాడు. న్యాయం కోసం ఆ మైనరు కుటుంబం రోడ్డు ఎక్కితే.. ఎమ్మెల్యే తన ప్రతాపం చూపించాడు. తప్పుడు కేసులు పెట్టాడు. లాకప్ లో బాధితురాలి తండ్రిని లేపేశాడు. బాధిత ప్రధాన సాక్షిని కోర్టుకు రాకుండా చంపేందుకు ప్రయత్నించాడు. ఇంత కిరాతక వ్యక్తిని .. ఫాస్ట్ కోర్టు విచారించింది.
శిక్ష వేసింది. 2019 డిసెంబర్ 20 నుంచి శిక్ష అమలు జరుగుతోంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం దోషిని.. నిర్దోషిగా ప్రకటించలేదు కానీ.. నిందితుడి ట్యాగ్ అవకాశం ఇచ్చింది. విచారణ తేలే వరకూ ఆయనకు స్వేచ్ఛ వరం లభించింది. ఈ కేసు ఎప్పుడుకు తేలుతుందో.. తేలదో.. అప్పటి వరకూ ఈయన గుండెనిబ్బరంగా జనంలో మళ్లీ జూలు విదల్చగలడు. ఇది నిజం.
Unnao Rape : వాట్ ఉన్నవ్ రేప్ స్టోరీ ?

ఉన్నావ్‌కు చెందిన మైనరు బాలికపై అప్పటి BJP ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ (Kuldeep Singh Sengar) 2017 జూన్‌లో అత్యాచారం(Rape) చేశాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. 2018 ఏప్రిల్ 8న లక్నోలోని సీఎం ఇంటి ఎదుట బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
జాతీయస్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీస్ కస్టడీలో బాధితురాలి తండ్రి మృతి చెందాడు. తొలుత సహజ మరణంగా పోలీసులు ప్రకటించారు. పోస్ట్‌మార్టం నివేదికతో అసలు నిజం వెలుగు చూసింది. పోలీసుల టార్చర్ బహిర్గతమైంది. పోలీసుల తీరుపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో కేసును CBIకి అప్పగించారు.

2018 ఏప్రిల్‌లో కుల్దీప్ సింగ్ సెంగార్‌ను అరెస్టు చేశారు. అత్యాచారం, హత్య, సాక్ష్యాలు లేకుండా చేయడం, సాక్షులను బెదిరించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2019 జూలైలో మరో ఘోర ఘటన జరిగింది. రాయ్‌బరేలీ కోర్టుకు బాధితురాలు వెళ్తుండగా ఆమె కారు ప్రమాదానికి గురైంది. కావాలనే ట్రక్కుతో ఢీకొట్టించారని దర్యాప్తులో తేలింది. ఈ దాడిలో ఇద్దరు బంధువులు మృతి చెందారు. బాధితురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందింది. ఈ ఘటనను హత్యాయత్నంగా నమోదు చేశారు. భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు కేసును ఢిల్లీకి బదిలీ చేసింది.
Unnao Rape : తెరమీదకు తీస్ హజారీ ఫాస్ట్ కోర్టు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో నుంచి కేసు విచారణను ఢిల్లీకి తరలించారు, 45 రోజుల్లోగా విచారణ ముగించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించారు. ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో బాధితురాలు (Survivor) చికిత్స పొందుతున్న సమయంలో, అక్కడే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఆమె సాక్ష్యాన్ని నమోదు చేశారు. ప్రాసిక్యూషన్ డిఫెన్స్ తరపున అనేక మంది సాక్షులను విచారించారు.
బాధితురాలు సహా ఆమె తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులను కీలక సాక్షులుగా విచారించారు. ఈ వియారణలో బాధితురాలి సాక్ష్యం (Sterling Witness) అత్యంత నమ్మదగ్గదిగా, నిజాయితీతో కూడినదిగా (“Sterling Quality”) ఉందని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పేర్కొంది. ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు ఆమె సాక్ష్యం ఒక్కటే శిక్షకు సరిపోతుందని న్యాయమూర్తి ధర్మేష్ శర్మ స్పష్టం చేశారు. నేరం జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ అని కోర్టు నిర్ధారించింది. నిందితుడిపై POCSO (పోక్సో) చట్టం కింద కఠినమైన సెక్షన్లు వర్తించాయి. ఎమ్మెల్యేగా నిందితుడు తన ప్రభావాన్ని ఉపయోగించి దర్యాప్తును ప్రభావితం చేశారని, బాధితురాలి కుటుంబంపై అనేక తప్పుడు కేసులు పెట్టించారని కోర్టు అభిప్రాయపడింది.
Unnao Rape : దోషిగా నిర్ధారణ.. శిక్ష

ఢిల్లీలోని తీస్ హజారీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు జస్టిస్ ధర్మేష్ శర్మ (District & Sessions Judge Dharmesh Sharma). డిసెంబర్ 16, 2019న కుల్దీప్ సింగ్ ను దోషిగా నిర్ధారించారు. డిసెంబర్ 20, శిక్షను ఖరారు చేశారు. దోషి కుల్దీప్ సింగ్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించింది. రూ. 25 లక్షల జరిమానా విధించింది.
బాధితురాలి తండ్రి హత్య కేసులో అదనపు 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. కోర్టు ఆదేశాలతో బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం అందించారు. కుటుంబానికి భద్రత కల్పించారు. బాధితురాలి గుర్తింపు గోప్యంగా ఉంచారు. సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ కుల్దీప్ సింగ్ జైలులోనే ఉన్నారు. తాజాగా హైకోర్టు నిర్ణయంతో బయటకు వచ్చే అవకాశం ఉంది.
Unnao Rape : హైకోర్టు సంచలన నిర్ణయం
ఉన్నావ్ అత్యాచారం కేసులో దోషిగా తేలిన మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, తనకు విధించిన శిక్షను సవాలు చేశారు. శిక్షను నిలిపివేయాలని (Suspension of Sentence) ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు.దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు డిసెంబర్ 23, 2025న అతనికి అనుకూలంగా కీలక తీర్పునిచ్చింది . నవంబర్ 7న ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది.

సెంగార్ కోరుకుంటే తన లిఖితపూర్వక వాదనలను దాఖలు చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. బాధితురాలికి, ఆమె కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున కుల్దీప్ సింగ్‌కు బెయిల్ ఇవ్వడానికి అర్హత లేదని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించారు. ఆమెను సోషల్ మీడియాలో వేధిస్తున్నారని, పరువు తీస్తున్నారని కోర్టుకు చెప్పారు. సీఆర్‌పీఎఫ్ భద్రతను ఉపసంహరించుకున్న తర్వాత కొందరు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించారని కూడా ఆయన కోర్టుకు వివరించారు.
దీనిపై ఇప్పటికే ఒక ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని తెలిపారు. మరోవైపు కుల్దీప్ సింగ్ సెంగార్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మనీష్ వసిష్ఠ్, న్యాయవాది కన్హయ్య సింఘాల్, బాధితురాలి తరపు న్యాయవాది వాదనలను వ్యతిరేకించారు. ఈ కేసులో నిందితుడు సెంగార్ గత 9 ఏళ్లుగా కస్టడీలో ఉన్నారని, కేవలం 11 నెలలు మాత్రమే మిగిలి ఉందని కోర్టుకు తెలిపారు.
Unnao Rape : బెయిల్ వరం

హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ ఈ మేరకు ఫాస్ట్ ట్రాక్ విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ, రూ.15 లక్షల వ్యక్తిగత బాండ్, అదే మొత్తంలో ముగ్గురు పూచీకత్తులను సమర్పించి సెంగర్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. బాధితురాలి ఇంటికి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి సెంగార్ ప్రవేశించకూడదని, బాధితురాలిని లేదా ఆమె తల్లిని ఏ విధంగానూ బెదిరించకూడదని లేదా సంప్రదించకూడదని హైకోర్టు ఆదేశించింది.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీలో మరణించిన కేసులో శిక్షను నిలిపివేయాలని సెంగర్ చేసిన పిటిషన్ హైకోర్టు ఎదుట పెండింగ్‌లో ఉంది. ఆ విషయంలో, తాను ఇప్పటికే అధిక కాలం జైలు శిక్ష అనుభవించినందున శిక్షను నిలిపివేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, కస్టడీలో మరణించిన కేసులో సెంగర్‌ను ట్రయల్ కోర్టు దోషిగా నిర్ధారించి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
Unnao Rape : సుప్రీం కోర్టులో పిటీషన్ ..
ఉన్నావ్ అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ జీవిత ఖైదును నిలిపివేస్తూ, డిసెంబర్ 23, 2025న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (Special Leave petion) దాఖలైంది. ఉన్నావ్ అత్యాచారం కేసుకు సంబంధించి కుల్దీప్ సెంగర్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ అడ్వకేట్-ఆన్ -రికార్డ్ సంజీవ్ మల్హోత్రా ద్వారా న్యాయవాదులు అంజలే పటేల్ పూజా శిల్ప్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ లో వివరాలు ఇలా ఉన్నాయి.
Unnao Rape : హైకోర్టు తీర్పుపై.. అభ్యంతరాలు

ట్రయల్ కోర్టు, రికార్డులోని మొత్తం సాక్ష్యాలను అభినందించిన తర్వాత, జీవిత ఖైదు విధించడమే కాకుండా, నిందితుడు తన సహజ జీవితంలో మిగిలిన కాలం జైలు శిక్ష అనుభవించాలని కూడా ఆదేశించినప్పుడు, శిక్షను నిలిపివేయడం బెయిల్ మంజూరు చేయడం కోసం దరఖాస్తును హైకోర్టు అనుమతించడం (Objection) సమర్థనీయమేనా అని పిటిషన్ ప్రశ్నించింది. ఇది నేరం తీవ్రత దారుణమైన స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రయల్ కోర్టు విచారణను పరిశీలనల విస్మరించి, నేరం తీవ్రతను గుర్తిచి, 7 సంవత్సరాల 5 నెలల శిక్షకాలాన్ని కస్టడీగా పరిగణించి , శిక్షను నిలిపివేయడానికి నేర న్యాయశాస్త్రం లేదా బైండింగ్ పూర్వాపరాలు లేకుండా ఉపశమనం మంజూరు చేయడంలో హైకోర్టు తప్పు చేసిందా అని ఈ పిటీషన్ లో ప్రశ్నలు రేగాయి.
Unnao Rape : ఇది చట్టం ఉల్లంఘనే

“1988 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 2 (సి) కింద పరిగణించబడిన “ప్రజా సేవకుడు” చట్టబద్ధమైన నిర్వచనాన్ని ఇతర సంబంధిత శిక్షా నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడంలో హైకోర్టు చట్టంలో వాస్తవాలపై తీవ్రంగా తప్పు చేసింది, నిందితుడు -ప్రతివాది బెయిల్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటూ, వివాదాస్పదంగా, ఆరోపించిన దారుణమైన నేరం జరిగిన సమయంలో శాసనసభలో సిట్టింగ్ సభ్యుడు (ఎమ్మెల్యే)గా ఉన్నాడు” అని పిటిషన్ వాదిస్తోంది.
పార్లమెంటు సభ్యులు శాసనసభ సభ్యులు సార్వభౌమ ప్రజా విధులను నిర్వర్తిస్తారని, చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగిస్తారని, రాష్ట్ర ఖజానా నుండి ప్రజా వేతనాలను తీసుకుంటారని అత్యున్నత జవాబుదారీతనం కలిగిన ప్రజా విధులను అప్పగించారని సుప్రీంకోర్టుకు చెప్పబడింది; అందువల్ల, వారు నేర బాధ్యత ప్రయోజనాల కోసం, ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టం అనుబంధ చట్టాల ప్రకారం “ప్రజా సేవకుడు” పరిధిలోకి వస్తారు.
Unnao Rape : హైకోర్టు నిర్ణయంపై విమర్శల దాడి

ఎంపీలు ఎమ్మెల్యేలను “ప్రజా సేవకులు”గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన స్థిరపడిన చట్టపర స్థితిని అభినందించకుండా, నిందితుడిని చట్టబద్ధ వర్గీకరణ నుండి మినహాయించడానికి హైకోర్టు ముందుకు సాగింది, తద్వారా అతనికి అనవసర బెయిల్ ప్రయోజనాన్ని విస్తరించింది. హైకోర్టు ఆదేశాలు శాసనసభ ఆదేశానికి విరుద్ధంగా ఉండటమే కాకుండా, వక్రబుద్ధి, స్వీయ విరుద్ధమైనది నేర న్యాయశాస్త్రం మంచి సూత్రాలపైనా అర్థం చేసుకోలేని స్థితి స్పష్టమవుతోంది. ఇటువంటి తప్పుడు వివరణ నేర న్యాయ పరిపాలన మూలాలను దెబ్బతీస్తుంది ప్రభుత్వ పదవులను కలిగి ఉన్న వ్యక్తుల అవినీతి నేరపూరిత దుష్ప్రవర్తనను అరికట్టే చట్టబద్ధమైన లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Unnao Rape : మళ్లీ న్యాయ కోసం ..

రాహుల్, సోనియాను కలిసిన బాధితురాలు..బాధితురాలు, ఆమె తల్లి రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీని డిసెంబర్ 24న ఢిల్లీలో కలిశారు. సుప్రీంకోర్టు(Supreme court)లో సెంగర్‌పై కేసును వాదించడానికి సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు సాయం చేయాలని కోరారు. ఇందుకు రాహుల్ వారికి హామీ ఇచ్చారు. రేపిస్టుకు బెయిల్ మంజూరు చేయడంపై రాహుల్ గాంధీ తన అంసతృప్తిని ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు. “రేపిస్టులకు బెయిల్ ఇవ్వడం, బాధితులను నేరస్థులలా చూడటం – ఇది ఎలాంటి న్యాయం? ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వినిపించడం ప్రతి పౌరుడి హక్కు. దానిని అణచివేయాలని చూడడం నేరం’’ అని పోస్టులో రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పష్టం చేశారు. తాజా హైకోర్టు ఉత్తర్వులతో ఈ కేసు మళ్లీ జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇప్పుడు సుప్రీం కోర్టు దిశానిర్దేశం ఏ విధంగా ఉండబోతుందన్నది కీలకంగా మారింది.
ALSO READ : DEADLY CONTAINER : శవ మంటలు Andhra Prabha Spl Report
