అవినీతి అక్రమాలతోనే రెండేళ్లు..

అవినీతి అక్రమాలతోనే రెండేళ్లు..

  • ఒక్క మంచి పని చేసామని చెప్పే ధైర్యం ఉందా…
  • రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధం..
  • ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్..
  • వెన్నుపోటు’ పాలనకు రెండేళ్లు.. వైసీపీ నిరసన ర్యాలీ
  • కూటమి మేనిఫెస్టో దహనం చేసిన వైసీపీ శ్రేణులు
  • హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న దేవినేని అవినాష్
  • 2029లో ప్రజలే కూటమికి గుణపాఠం చెబుతారని హెచ్చరిక

ఆంధ్రప్రభ. విజయవాడ : అవినీతి అక్రమాలు దౌర్జన్యంతోనే రెండేళ్ల పాటు కోటమీ పాలన కొనసాగిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. రెండేళ్లలో ఒక్క మంచి పని అయినా చేశామని చెప్పుకునే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదన్న ఆయన ఈ రెండేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను రెండేళ్లు గడిచినా అమలు చేయలేకపోయారని, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

రెడ్‌బుక్ పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారని అవినాష్ విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా అవినీతి, అక్రమ సంపాదనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్‌లు, ఫ్లైఓవర్లు, రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థల నిర్మాణంతో విజయవాడ నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణం పేరుతో విజయవాడ ప్రజలను మోసం చేస్తున్నారని, నగరాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి సమస్యలు తెలుసుకునేందుకు కూటమి నాయకులు ముందుకు రావడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పుకోదగ్గ ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించిన అవినాష్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.