Stock Market Rally | రూ.7 లక్షల కోట్ల లాభం..
Stock Market Rally | రూ.7 లక్షల కోట్ల లాభం..
Stock Market Rally | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. గత కొన్ని వారాల తర్వాత మార్కెట్లు బలమైన లాభాలతో ముగియగా, పెట్టుబడిదారుల సంపద ఒక్కరోజులో సుమారు రూ.7 లక్షల కోట్లు పెరిగింది.
BSE Sensex 1,695 పాయింట్లు ఎగబాకి 75,527 వద్ద ముగియగా, Nifty 50 461 పాయింట్లు లాభపడి 23,622 వద్ద స్థిరపడింది. రోజంతా కొనుగోళ్ల జోరు కొనసాగడంతో సూచీలు దాదాపు 2 శాతం మేర పెరిగాయి. సెన్సెక్స్‌లోని అన్ని ప్రధాన రంగాల షేర్లు లాభాల బాట పట్టాయి. ముఖ్యంగా Tata Steel, InterGlobe Aviation, Larsen & Toubro, ఎటర్నల్, State Bank of India, Tech Mahindra షేర్లు 3 శాతం వరకు పెరిగాయి. స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2 శాతం వరకు లాభపడ్డాయి.
మార్కెట్ల ఈ భారీ ర్యాలీకి అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా నిలిచాయి. ఇరాన్‌పై దాడులు మరింత తీవ్రం చేస్తామని గతంలో హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్‌తో దౌత్యపరమైన ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని, ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయని సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం ఏర్పడింది.
ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. బ్రెంట్, డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు సుమారు 4 శాతం వరకు పడిపోవడంతో బ్యారెల్ ధర 90 డాలర్ల స్థాయికి చేరింది. చమురు ధరల తగ్గుదల భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా ఉండటంతో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరిగాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భౌగోళిక ఉద్రిక్తతలు మరింత తగ్గి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగితే దేశీయ మార్కెట్లకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది.
